నారావారిపల్లెలో స్కూల్‌ని కూడా పట్టించుకోలేదు.. వైసీపీ వచ్చాకే : చంద్రబాబుపై మండిపడ్డ జగన్‌

By Siva KodatiFirst Published Sep 20, 2022, 3:31 PM IST
Highlights

ప్రభుత్వ స్కూళ్లలో డ్రాపౌట్ రేటు పెరుగుతున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెలో స్కూలు ఎలా వుందో చూడాలంటూ జగన్ చూపించారు. 

ప్రపంచంలో విద్యావ్యవస్థ వేగంగా మారుతోందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం విద్యారంగంలో నాడు- నేడుపై జగన్ ప్రసంగిస్తూ.. రాష్ట్రంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టామన్నారు. గతంలో కార్పోరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు వుండేవని.. స్కూళ్లను నిర్వీర్యం చేసి, ప్రభుత్వ బడులకు వెళ్లడం అనవసరం అనేలా చేశారని జగన్ మండిపడ్డారు. బెంచీలు, మంచినీళ్లు, బ్లాక్‌బోర్డులు వుండేవి కావని సీఎం అన్నారు. డ్రాపౌట్ రేటు పెరుగుతున్నా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లెలో స్కూలు ఎలా వుందో చూడాలంటూ జగన్ చూపించారు. 

వైసీపీ అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఆ స్కూల్‌ని మార్చేశామని సీఎం తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకుండా ఎందుకు వదిలేశారని జగన్ ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ విద్య వైపు అడుగులేస్తోందని... పిల్లలకు నాణ్యమైన విద్య అందిస్తే కుటుంబాలు మారుతాయని సీఎం పేర్కొన్నారు. అందుకే నాడు- నేడు ద్వారా స్కూళ్లపై ఫోకస్ పెట్టామని.. మొత్తం 57 వేల స్కూళ్లు, హాస్టళ్ల రూపు రేఖలు మార్చబోతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి 15 వేలకి పైగా స్కూళ్లలో డిజిటలైజేషన్ చేస్తామని.. ఉన్నత విద్యను హక్కుగా మార్చామని జగన్ పేర్కొన్నారు. 

గోరుముద్ధ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని.. అమ్మ ఒడి ద్వారా ఈ మూడేళ్లలో రూ.19 వేల కోట్లు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. టాయిలెట్లు, స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేశామని జగన్ తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పిల్లలకు అండగా నిలుస్తున్నామని సీఎం పేర్కొన్నారు. గతంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ అట్టడుగున వున్న పరిస్ధితి నెలకొందని జగన్ గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులకు పునర్వైభవం వచ్చిందన్నారు. అమ్మఒడి పథకం ఓ విప్లవాత్మకమైన ముందడుగు అన్న ఆయన.. దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదని తెలిపారు. అయాల గౌరవ వేతనం వెయ్యి నుంచి 3 వేలకు పెంచామని.. అమ్మఒడితో మూడేళ్లలో 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరుతోందని చెప్పారు. 

అమ్మఒడి పథకానికి 17 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టామని.. జగనన్న గోరుముద్ధ పథకంతో పౌష్టికాహారం అందిస్తున్నామని సీఎం తెలిపారు. సరుకుల బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదని జగన్ ఎద్దేవా చేశారు. గోరుముద్ధ పథకానికి ఏడాదికి 1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. విద్యా కానుకలో భాగంగా విద్యార్ధులకు ట్యాబ్‌లు ఇస్తున్నామని సీఎం చెప్పారు. విద్యా కానుక కింద రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. 8వ తరగతి విద్యార్ధులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇస్తున్నామని జగన్ వెల్లడించారు. విద్యార్ధులకు పూర్తి ఫీజులను చెల్లిస్తున్నామని... 24 లక్షల మంది విద్యార్ధులకు ప్రయోజనం కలుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.8365 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను కూడా చెల్లించామని జగన్ పేర్కొన్నారు. వసతి దీవెన ద్వారా 18 లక్షల మందికి ప్రయోజనం కలుగుతోందన్నారు. 
 

click me!