వైఎస్ కున్న దమ్ము చంద్రబాబుకు లేదా?

First Published Nov 3, 2017, 2:12 PM IST
Highlights
  • దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికున్న దమ్ము చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి లేదా?
  • రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కు పెద్ద అనుమానమే వచ్చింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వానికున్న దమ్ము చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి లేదా? రాజమండ్రి పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కు పెద్ద అనుమానమే వచ్చింది. ఇంతకీ ఆయనకు అంత సందేహం ఎందుకు వచ్చింది? ఎందుకంటే, పోలవరం ప్రాజెక్టు పనులు చేయలేకపోతున్న కాంట్రాక్ట్ సంస్ధను తప్పించలేకపోతున్నందుకు అట. నిజంగానే చంద్రబాబు ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే కాంట్రాక్ట్ సంస్ధ ట్రాన్ స్ట్రాయ్ సంస్ధను కాంట్రాక్ట్ నుండి పక్కకు తప్పించాలని డిమాండ్ చేసారు.

ఇదే పోలవరం ప్రాజెక్టును గతంలో టిడిపి ఎంపి నామా నాగేశ్వర్ రావు చేసారట. అప్పుడు కూడా ప్రాజెక్టు పనులను నామా సంస్ధ 70 శాతం కన్నా చేయలేకపోయిందట. వైఎస్ సిఎం కాగానే ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారట. వెంటనే నామాను పిలిపించి పోలవరం ప్రాజెక్టు పనులు చేసే శక్తి లేదు కాబట్టి కాంట్రాక్టు నుండి తప్పుకోమని చెప్పారట.

కాంట్రాక్టు నుండి తప్పిస్తే నామా ఏమైనా కోర్టుకు వెళతారా అని కూడా వైఎస్ ఆలోచించారట. అయినా సరే పిలిపించి మాట్లాడుదామనుకున్నారట. అందుకనే పిలిచి కాంట్రాక్టు నుండి తప్పుకోమని స్పష్టంగా చెప్పారట. నామా కూడా అంగీకరిస్తూ కాంట్రాక్టు నుండి తప్పుకున్నారట. అదే విషయాన్ని ఉండవల్లి గుర్తుచేస్తూ, ప్రభుత్వంలో దమ్ముంటే కాంట్రాక్టర్ ఎందుకు ఎదురుతిరుగుతారని మండిపడ్డారు.

కాంట్రాక్టు సంస్ధతో ప్రభుత్వం కుమ్మకైతేనో లేకపోతే ప్రభుత్వంలో ఏదైనా లోపాలుంటేనో కాంట్రాక్టర్ తప్పించాలంటే ఇబ్బందవుతుందని కూడా ఉండవల్లి చెప్పారు.  వైఎస్ అప్పట్లో కాంట్రాక్ట్ నుండి తప్పించినపుడు నామా కాంగ్రెస్ పార్టీ కాదని, టిడిపి పార్లమెంట్ పార్టీ నేత అన్న విషయాన్ని గుర్తుచేసారు. మరిపుడు పోలవరం కాంట్రాక్టు చేస్తున్నది టిడిపి ఎంపి సంస్ధ అయినా చంద్రబాబు ఎందుకు తప్పించలేకపోతున్నారంటూ ఉండవల్లి ధర్మసందేహాన్ని వ్యక్తం చేసారు. 

 

click me!