మావోయిస్టులు, మహానాడు మధ్యలో పోలీసులు

Published : May 26, 2017, 01:46 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మావోయిస్టులు, మహానాడు మధ్యలో పోలీసులు

సారాంశం

మావోయిస్టులకు ఎంతో కీలకమైన ఏఒబి ప్రాంతం కొన్ని వేలకిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఏ వైపునుండైనా మావోయిస్టు దళాలు ఎక్కడైనా విరుచుకుపడే అవకాశాలున్నాయి. అందుకనే ఎప్పుడైతే అధికార పార్టీ మహానాడును విశాఖలో నిర్వహించాలని నిర్ణయించిందో అప్పటి నుండి ఏఒబి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు.

ఒకవైపు మహానాడు..ఇంకోవైపు మావోయిస్టుల వారోత్సవాలు. రెండింటికి కేంద్రం విశాఖపట్నమే. దాంతో పోలీసులకు పెద్ద సవాలు ఎదురైంది. విశాఖపట్నంలో శనివారం నుండి టిడిపి మూడురోజుల మహానాడు ప్రారంభమవుతోంది. ఇంకోవైపు శుక్రవారం నుండి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈ రెండు కార్యక్రమాలు పరస్పర విరుద్దమైనవే. ఒకటేమో అధికార తెలుగుదేశంపార్టీ గడచిన 30 ఏళ్ళుగా నిర్వహించుకుంటున్న ప్రతిష్టాత్మక పార్టీ కార్యక్రమం. అదే సమయంలో విధ్వంసాలే లక్ష్యంగా మావోయిస్టుల మొదల[న వారోత్సవాలు. వారోత్సవాల్లో వీలైనంత విధ్వంసానికి దిగటమే మావోయిస్టుల లక్ష్యమన్నది అందరికీ తెలిసిందే.

టిడిపి మహానాడు జరుగుతున్నది విశాఖపట్నంలోనే. అటు మావోయిస్టుల వారోత్సవాల్లో కీలక ప్రాంతం ఏవోబినే. ఏవొబి అంటే ఆంధ్ర ఒడిస్సా బార్డర్. ఏవొబికి విశాఖపట్నం జిల్లా చాలా కీలకం. విశాఖ కేంద్రంగా మావోయిస్టులు విజయనగరం, శ్రాకాకుళం జిల్లాలతో పాటు ఒడిస్సా, ఛత్తీస్ ఘర్ ప్రాంతాల్లో చెలరేగిపోతుంటారు. ఉనికి చాటుకోవటం కోసమే మావోయిస్టులు గురువారం ఛత్తీస్ ఘర్ లోని రైల్వే స్టేషన్ పేల్చివేశారు. దాంతో పోలీసులు పూర్తిస్ధాయిలో అలర్ట్ అయ్యారు.

మావోయిస్టులకు ఎంతో కీలకమైన ఏఒబి ప్రాంతం కొన్ని వేలకిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఏ వైపునుండైనా మావోయిస్టు దళాలు ఎక్కడైనా విరుచుకుపడే అవకాశాలున్నాయి. అందుకనే ఎప్పుడైతే అధికార పార్టీ మహానాడును విశాఖలో నిర్వహించాలని నిర్ణయించిందో అప్పటి నుండి ఏఒబి ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ మొదలుపెట్టారు.

గడచిన పది రోజుల్లో స్వయంగా డిజిపినే రెండు సార్లు ఏరియల్ సర్వే చేసారు. విశాఖపట్నంలో కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. అంతేకాకుండా సుమారు ఐదువేల మంది పోలీసులతో ఏఒబి ప్రాంతాన్ని అణువణువూ జల్లెడ పడుతున్నారు.

ఇవన్నీ ఒక ఎత్తైతే టిడిపి ఎంఎల్సీ ఎంవివిఎస్ మూర్తి రాజేసిన నిప్పొకటి. మహానాడు జరుగనున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణాన్ని మూర్తి దయ్యాలకొంపగా వర్ణించటంతో విద్యార్ధులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. వారినెలా సముదాయించాలో పోలీసులకు అర్ధంకావటం లేదు. విద్యార్ధుల నుండి మహానాడు కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటంతో పాటు మావోయిస్టుల కదలికలను నియంత్రించటం పోలీసులకు నిజంగా పెద్ద సవాలే.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu