తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుపై విమర్శలు చేస్తూ తెలంగాణ ప్రజలను అవమానిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.
విశాఖపట్నం : తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఏపీలో పాలన, వైసిపి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య అగ్గిని రాజేసాయి. ఇప్పటికే ఏపీలో బిఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ జరక్కుండా అడ్డుకుంటామంటూ బిఆర్ఎస్ నాయకుల ప్రకటనలు వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో పాలనపై హరీష్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. తాజాగా హరీష్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మంత్రి హరీష్ రావు మాటలు వింటే మామ కేసీఆర్ తో కలిసి ఫాం హౌస్‌లో కూర్చుని కల్లుతాగినట్లు అనిపించిందని అప్పలరాజు అన్నారు. కల్లుతాగిన కోతిలా ఒళ్ళు కొవ్వెక్కి హరీష్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ నీ మామలాగ ఫాం హౌస్ లో కూర్చుని కల్లు తాగడం లేదు... లేకపోతే ఆయన కూతురు కవిత లాగ లిక్కర్ స్కాంలు చేయడంలేదంటూ అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
Read More తెలంగాణలో వుండి కాదు.. ఏపీకి వచ్చి మాట్లాడు : హరీశ్ రావుకు మంత్రి అప్పలరాజు సవాల్
ఏపీ గురించి, జగన్ పాలన గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటూ హరీష్ ను అప్పలరాజు హెచ్చరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా కాపాడుకునే ప్రయత్నం వైసిపి ప్రభుత్వం చేస్తుంటూ మీరేమో ప్రైవేటికరణకు అనుకూలిస్తూ బిడ్ వేస్తామంటారా అని నిలదీసారు. బిడ్డింగ్ వరకు రాకూడదని మేం చూస్తుంటే వీళ్లు బిడ్డింగ్ వేస్తామంటున్నారు... అసలు ప్రభుత్వ సంస్థలు ఎక్కడయినా బిడ్డింగ్ వేస్తాయా...ఇది సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి మీరు సిగ్గూ ఎగ్గు లేకుండా విశాఖ స్టీల్ ప్యాక్టరీని కాపాడతామంటూ ఏపీ ప్రజలకు మాయమాటలు చెబుతారా అంటూ మంత్రి అప్పలరాజు మండిపడ్డారు.
వీడియో
బంగారు తెలంగాణ అంటూ ఉమ్మడి రాష్ట్రం నుండి నుండి వేరుపడిన తెలంగాణలో దొరల పాలన సాగుతోందని అప్పలరాజు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబమే రాష్ట్రంలోని ఉన్నత పదవులను అనుభవిస్తోందని అన్నారు. తెలంగాణను వారి జాగీర్ లాగ కల్వకుంట్ల కుటుంబం భావిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ తో సహా కొడుకు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్... ఇలా మొత్తం కల్వకుంట్ల కుటుంబమంతా ప్రాంతీయ ఉగ్రవాదులేనని మండిపడ్డారు. పనికిమాలిన మాటలు ఆపి మీ పనేదో మీరు చూసుకుంటే మంచిదని ఏపీ మంత్రి హెచ్చరించారు.
ఇక తెలంగాణ ప్రజలపైనా అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రావాళ్లు తెలంగాణ రావడం మానేస్తే అడుక్కుతినడం తప్ప అక్కడేం వుండదన్నారు. తెలంగాణ వాళ్ళకు బుర్రతక్కువగా వుంటుందంటూ మంత్రి అప్పలరాజు తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఇదిలావుంటే మరో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తెలంగాణ మంత్రి హరీష్ కు కౌంటరిచ్చారు. రాజాకీయాల కోసం బిఆర్ఎస్ నాయకులు మరీ ముఖ్యంగా హరీష్ రావు ఏదైనా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధిపై మాట్లాడడానికి అసలు హరీష్ రావు ఎవరంటూ బొత్స నిలదీశారు. బాధ్యత గల వ్యక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటూ హరీష్ కు బొత్స సత్యనారాయణ హితవు పలికారు. మా రాష్ట్రం గురించి మాకు తెలుసునని.. మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోవాలని బొత్స చురకలంటించారు.