అమూల్ చేతికి ఏపీ డెయిరీ ఆస్తులు: ఏపీ హైకోర్టులో విచారణ... 27కి వాయిదా

By Siva KodatiFirst Published May 20, 2021, 2:47 PM IST
Highlights

ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. 

ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ పిటిషన్‌ను వేశారు. డెయిరీ ఆస్తులని అమూల్ సంస్థకు ఇవ్వాలని  ప్రభుత్వం కెబినెట్ నిర్ణయం తీసుకుని ఈ నెల 19న జీవో 117 ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ కోపరేటివ్ లిమిటెడ్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ తెలిపారు. జీవో సవాలు చేస్తూ పిటిషన్ వేశారా అని పిటిషనర్‌ని హైకోర్టు ప్రశ్నించగా.. పిటిషన్ వేసేటప్పటికి జీవో ఇవ్వలేదని పిటిషనర్ వెల్లడించారు. జీవో సవాలు చేస్తూ అనుబంధ పిటిషన్ వేయాలని హైకోర్టు ఆదేశిస్తూ... తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

Also Read:సంగం డెయిరీపై కోర్టు తీర్పు.. గంటల్లోనే మరో వివాదం, సర్వర్లు హ్యాక్ అయ్యాయన్న యాజమాన్యం

కాగా, ఏపీ డెయిరీ ఆస్తుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్‌ నిరర్థక ఆస్తులను అమూల్ సంస్థకు నామమాత్రపు లీజు ప్రాతిపదికన అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూపొందించిన డ్రాఫ్ట్ లీజు ఒప్పందానికి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదముద్ర వేసింది.

ప్రభుత్వ-అమూల్ ప్రాజెక్టులో భాగంగా లీజు ప్రాతిపదికన ఏపీ డెయిరీకి వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను అమూల్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం  ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల పునరుజ్జీవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

click me!