వైఎస్ జగన్ కు షాక్: నిమ్మగడ్డ కొనసాగింపునకు గవర్నర్ ఆదేశాలు

By telugu teamFirst Published Jul 22, 2020, 11:09 AM IST
Highlights

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వైఎస్ జగన్  ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఎస్ఈసిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆయన ఆదేశించారు.

అమరావతి: నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని గవర్నర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజ్యాంగ నిపుణులను సంప్రదించి గవర్నర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

హైకోర్టు ఆదేశాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారంనాడు గవర్నర్ ను కలిసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు తనను ఎస్ఈసీగా కొనసాగించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కోరారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు గతంలో కొట్టేసిన విషయం తెలిసిందే. 

Also Read: 40 నిమిషాలు భేటీ: గవర్నర్ చేతిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భవిష్యత్తు

ఎస్ఈసిగా కనగరాజ్ నియామకం చెల్లదని కూడా హైకోర్టు తేల్చి చెప్పింది. ఎస్ఈసిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆదేశించింది. అయితే, జగన్ ప్రభుత్వం ఆయనను ఎస్ఈసిగా తిరిగి నియమించకుండా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలనే హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.

Also Read: గవర్నర్ తో భేటీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎత్తుకు జగన్ సర్కార్ పైయెత్తు

ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పాటించలేదు. దీంతో తిరిగి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో గవర్నర్ ను కలవాల్సిందిగా హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కు సూచించింది. ఆ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 

ఆ సమయంలోనే కేసు కోర్టులో ఉన్నందున రమేష్ కుమార్ ను కొనసాగించాలనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపథ్యంలో గవర్నర్ హరిచందన్ నిమ్మగడ్డను ఎస్ఈసీగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ ఆదేశాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాల్సిందే.

click me!