చాలా కొద్ది మంది వ్యక్తులే ఇలాంటి గొప్ప ఆలోచనలు చేస్తారు: జగన్ పథకాలపై గవర్నర్ ప్రశంసలు

By Nagaraju penumalaFirst Published Jul 25, 2019, 9:43 AM IST
Highlights

విద్యకోసం వెచ్చించే సొమ్మును మూలధన వ్యయంగా పరిగణించడం ప్రశంసనీయమన్నారు. చాలాకొద్ది మంది వ్యక్తులే ఇలాంటి గొప్ప ఆలోచన చేస్తారని గవర్నర్ ప్రశంసించారు. విద్యార్థి దశలో ఏ సందర్భంలో ఎంత తెలివిగా వారిపై సొమ్మును ఖర్చుచేస్తే సమాజానికి అంత గొప్ప ఫలితాలను అది అందిస్తుందన్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ గవర్నర్ బిబీ హరిచందన్. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రసంగించిన గవర్నర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించిన సీఎం వైయైస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. 

వైయస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా వినూత్న పథకాలతో సామాజిక అభివృద్ధికి కృష్టి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల కష్టాలను, సమస్యలను తెలుసుకునేందుకు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి జనం తన దృష్టికి తెచ్చిన సమస్యల ఆధారంగా నవరత్నాలు అనే మేనిఫెస్టోను రూపొందించిన విధానమే ఆయన విజయానికి నాంది అంటూ చెప్పుకొచ్చారు. 

వైయస్ జగన్‌ తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో గొప్ప సంక్షేమ పథకాలతో జాతికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. వైయస్ పథకాలకు మరింత మెరుగు దిద్ది జనం దరిచేర్చేందుకు కృషి చేస్తున్న జగన్ ముందు చూపును అభినందిస్తున్నానని చెప్పుకొచ్చారు. 

అమ్మఒడిపథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గవర్నర్ బీబీ హరిచందన్. పిల్లలను పాఠశాలలకు పంపుతున్న తల్లికి ప్రోత్సాహకం అందించాలన్న సీఎం ఆలోచన విధానం సామాజిక మార్పు సాధనలో గొప్ప అడుగు అంటూ కితాబిచ్చారు. 

అమ్మఒడి పథకం ఆర్థిక, సామాజిక మార్పు సాధనకు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు సామాజిక రుగ్మతగా మారిన బాలకార్మిక వ్యవస్థనూ నిర్మూలించవచ్చని స్పష్టం చేశారు. 

మరోవైపు సీఎం జగన్ అమలు చేస్తున్న విధానాలు విద్యారంగం ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని కొనియాడారు. విద్యకోసం వెచ్చించే సొమ్మును మూలధన వ్యయంగా పరిగణించడం ప్రశంసనీయమన్నారు. 

చాలాకొద్ది మంది వ్యక్తులే ఇలాంటి గొప్ప ఆలోచన చేస్తారని గవర్నర్ ప్రశంసించారు. విద్యార్థి దశలో ఏ సందర్భంలో ఎంత తెలివిగా వారిపై సొమ్మును ఖర్చుచేస్తే సమాజానికి అంత గొప్ప ఫలితాలను అది అందిస్తుందన్నారు. 

అలాగే రైతు సంక్షేమం ఈ ప్రభుత్వ అజెండాగా ముందుకు వెళ్తుందని అది అభినందనీయమన్నారు. నాణ్యమైన విత్తనాలకు మూలధనం అందించడంతోపాటు, ఎరువులు, పురుగు మందులు సమకూర్చడం, గిట్టుబాటు ధర కల్పించడం వంటి నిర్ణయాలు ఎంతో గొప్పవంటూ ప్రశంసించారు. 

పింఛన్లతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చేందుకు వాలంటీర్ల నియామకం, వికేంద్రీకృత పాలనను అందించేందుకు గ్రామ సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని బీబీ హరిచందన్ అభిప్రాయపడ్డారు. 

ఈ సందర్భంగా స్వామి వివేకానంద వ్యాఖ్యాలను గవర్నర్ హరిచందన్ ప్రస్తావించారు. లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించవద్దన్న ఆయన సూక్తి సదా ఆచరణీయమని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. 

అవరోధాలను అధిగమించి సమగ్రాభివృద్ధి సాధించే దిశగా రాష్ట్రం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఒడిదుడుకులన్నీ పరిష్కారమై సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం సాగుతుందన్న ఆశ, నమ్మకం తనకున్నాయని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఎందరో మేధావులు, రచయితలు, రాజనీతిజ్ఞులు చూపిన దూరదృష్టి, దార్శనికతతో ఆంధ్రప్రదేశ్‌ అనేక రంగాల్లో దేశంలనే అగ్రభాగాన నిలిచిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలుగు భాష, తెలుగు సంస్కృతి తనకు కొత్తేమీ కాదన్నారు. 

శ్రీకాకుళం జిల్లా పక్కనే ఉన్న గంజాం తన స్వస్థలం అంటూ చెప్పుకొచ్చారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను వారసత్వంగా పొంది, సంస్కరణలకు ఆలవాలమై, పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన అమరావతి పురోగతిలో తానూ భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ బీబీ హరిచందన్ అభిప్రాయపడ్డారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం (పోటోలు)

ఏపీ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ ప్రమాణం

నూతన గవర్నర్ కు స్వాగతం పలికిన సీఎం జగన్

నరసింహన్ ఇక తెలంగాణకే: ఏపీకి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్

click me!