అబద్ధాల అమిత్ షాకు సన్మానాలా?

First Published May 26, 2017, 3:07 PM IST
Highlights

కేంద్రం ఆంధ్రాకు రు.1.75 లక్షల కోట్ల సహాయం చేసిందని అమిత్‌ షా చెప్పేదంతా  పచ్చి అబద్ధం. కేంద్ర సాయంపై  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణం స్పందించాలి.  ఇప్పటివరకు కేంద్రం చేసిన సాయంపై  వైట్ పేపర్ విడుదల చేయాలి:ఎపి కాంగ్రెస్  

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన సాయం మంటూ నోటికొచ్చినట్లుగా కాకి లెక్కలు చెబుతుంటే ఖండించడానికి బదులు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానాలు చేస్తున్నాడని  విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లాది విష్ణు, ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ  విమర్శించారు.

 

ఈ విషయంలో ఆయన  తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ నుంచి నేర్చుకోవాలని అన్నారు.

 

శుక్రవారం ఆంధ్రరత్నభవన్‌లోని సిటీ కాంగ్రెస్‌ కార్యాలయంలో పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందటం లేదని, అదనంగా అసలు అందలేదని అంటూ చప్పట్లకోసం అమిత్ షా  పచ్చి అబ్దాలు చెబుతున్నారని విమర్శించారు.

 

‘ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కేంద్రప్రభుత్వ సంస్థలను కూడా  అరకొర నిధులతో సరిపెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదని తెలిసినా ఆ డిమాండ్ ను పక్కన పడేశారు.. లక్షా 75 వేల కోట్ల రూపాయల సాయం రాష్ట్రానికి అందిందని అమిత్‌ షా చెబుతున్నారు. ఇది అందిందా లేదా అనే విషయంమీద  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు వివరణ ఇవ్వాలి,‘ అని వారు డిమాండ్‌ చేశారు. 

 

అమిత్‌ షా చెప్పేవన్ని పచ్చి అబద్ధాలని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణం స్పందించి, ఇప్పటివరకు కేంద్రం చేసిన సాయంపై  వైట్ పేపర్ విడుదల చేయాలని కొలనుకొండ శివాజీ డిమాండ్‌ చేశారు.

 

‘తెలంగాణాలో కూడా ఇలాగే అమిత్‌ షా అవాకులు చెవాకులు పేలితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే స్పందించి అమిత్‌ అబద్ధాలను ఎండగట్టారు.అబద్ధాలు చెప్తున బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్‌ కార్పెట్‌ పరిచి, సత్కారాలు చేసి, విందు సమావేశాలను ఏర్పాటు చేయడంఎంతవరకు సబబు,’ అని ఆయన ప్రశ్నించారు.

 

అన్ని రాష్ట్రాల మాదిరిగానే వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలు, జాతీయ రహదారుల నిర్మాణ పథకాలు, పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాలను లెక్క గట్టి అమిత్‌ షా 1.75 లక్షల కోట్లు పైనే ఆర్థిక సాయం అందించామని అవాస్తవాలు చెబుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనందంగా అబద్ధాలను వింటూండటం విడ్దూరం అని వారు పేర్కొన్నారు.

 

తెలుగుదేశం పరిపాలన మూడేళ్ల ముచ్చట గురించి మాట్లాడుతూ  తెలుగుదేశం నాయకులు  దోపిడికి ఇసుక, మట్టిని కూడద వదలడం లేదని విష్ణు, శివాజీ  విమర్శించారు.

 

’కలెక్టర్లు చట్ట బద్ధంగా వ్యవహరించకుండా అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకున్నారు.  పాలక పార్టీ పోలీస్‌ వ్యవస్థను బంట్రోతు వ్యవస్థలాగా మార్చేసిది.  తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సీఐని అవమానించిన తీరే ఇందుకు నిదర్శనం’  వారు అన్నారు.

 

సమావేశంలో కాంగ్రెస్‌ బీసీ సెల్‌ నగర అధ్యక్షులు బంకా భాస్కరరావు, పీసీసీ కార్యదర్శి వెన్నా రత్నారావు, మైనార్టీ సెల్‌ కన్వీనర్‌ మహమ్మద్‌ బేగ్‌, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 

click me!