నిరుద్యోగులకు గుడ్ న్యూస్... 50,449 మందికి ఒకేసారి నియామక పత్రాలు

By Arun Kumar PFirst Published Jul 3, 2020, 1:14 PM IST
Highlights

ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌''(ఆప్కాస్‌) కార్యకలాపాలు లాంఛనండా ప్రారంభమయ్యాయి. క్యాంప్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆప్కాస్ సర్వీస్ లను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.  

అమరావతి: ''ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌''(ఆప్కాస్‌) కార్యకలాపాలు లాంఛనండా ప్రారంభమయ్యాయి. క్యాంప్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆప్కాస్ సర్వీస్ లను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒకేసారి 50 వేల మందికి పైగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు నియామక పత్రాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్సులో లబ్ధిదారులతో మాట్లాడారు సీఎం జగన్.

ఈ  సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. ''ఈరోజు ఆప్కాస్‌ ప్రారంభం కావడం అన్నది నిజంగా ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావడంలో మరో అడుగు. నా సుదీర్ఘ పాదయాత్రలో అన్ని ప్రాంతాలు తిరిగాను. 14 నెలల పాటు 3648 కి.మీ నడిచాను. అప్పుడు ప్రతి చోటా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల బాధలు విన్నాను. చూశాను. ఉద్యోగం కోసం లంచాలతో పాటు, మళ్లీ జీతం తీసుకోవడానికి కూడా లంచం ఇవ్వాల్సి వస్తోందని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు చెప్పారు'' అని అన్నారు. 

''అంతేకాకుండా కాంట్రాక్ట్‌లో ఒక జీతం చూపి అంత కంటే తక్కువగా చేతికి ఇస్తున్నారని ఆ ఉద్యోగులు ఆవేదన చెందారు. ఔట్‌ సోర్సింగ్‌లో కొందరికి మేలు చేయడం కోసం కాంట్రాక్టర్లను తీసుకువచ్చారు. కొన్ని చోట్ల నాయకులు కాంట్రాక్టర్లుగా మారారు'' అని మండిపడ్డారు.

''ఆలయాల్లో పారిశుద్ధ్య కాంట్రాక్ట్‌ పనులు గతంలో రూ.6 లక్షలుంటే దాన్ని ఏకంగా రూ.30 లక్షలకు పెంచి భాస్కరనాయుడుకు ఇచ్చారు. ఆయన చంద్రబాబుకు బంధువు.
 ఈ వ్యవస్థ మార్చాలని, పారదర్శకత తేవాలని, ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇవ్వాలని, ఎవరికీ లంచాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండాలని, ఎక్కడా వివక్షకు తావుండకూడదని భావించాము''  అని వెల్లడించారు.

read more లంచాలు లేకుండానే ఉద్యోగాలు, జీతాలు: వైఎస్ జగన్

''అంతే కాకుండా 50 శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు... వాటిలోనూ మహిళలకు 50 శాతం ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఆప్కాస్‌ ఏర్పాటు చేశాం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఛైర్మన్లుగా, జేసీలతో కూడిన కమిటీలు పని చేస్తాయి. జిల్లా ఇంఛార్జ్‌ మంత్రులు రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూస్తారు. దీంతో ఎక్కడా అవినీతికి తావుండదు'' అని తెలిపారు. 

''ఉద్యోగులకు ఠంచనుగా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా జీతాలు ఇవ్వనున్నాం. వాటిలో కమిషన్లు, లంచాలు ఉండవు. పద్ధతి ప్రకారం వారికి జీతాలు ఇస్తారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ క్రమం తప్పకుండా ఉద్యోగులకు మేలు జరిగేలా చెల్లిస్తారు. ఈ విధంగా రెండు కేంద్రాల వల్ల కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఎలాంటి కోత లేకుండా జీతాలు వస్తాయి. వివక్ష లేకుండా ఉద్యోగాలు వస్తాయి'' అని అన్నారు.

''ఆప్కాస్‌ ద్వారా ఇప్పటికే 50,449 మందికి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. ఇదో డైనమిక్‌ నెంబరు. ఇది ప్రతి నెల మారుతూ పోతుంది. రాబోయే రోజుల్లో అన్ని శాఖలు ఈ కార్పొరేషన్‌తో అనుసంధానమవుతాయి. దీంతో ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ఆప్కాస్‌ వల్ల మరో మహత్తర మార్పు ఏమిటంటే.. గతంలో అవసరాని కంటే తక్కువగా సిబ్బందిని నియమించి కాంట్రాక్ట్‌ సంస్థ పని చేయించేది. అదే విధంగా లేని వాళ్లను రికార్డుల్లో చూపించి వారి జీతం కూడా ఆ సంస్థే తీసుకునేది. ఇక నుంచి అలాంటి వాటికి తావుండదు'' అని పేర్కొన్నారు.

''ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. భద్రత అనేది మన పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. జీతాలు కచ్చితంగా ప్రతి నెలా వచ్చేలా ప్రభుత్వం చూస్తుంది. అందుకోసం కార్పొరేషన్‌ పని చేస్తుంది. పని చేసే పిల్లలకు మేలు జరగాలని, చేతివాటానికి తావు లేకుండా పూర్తి జీతాలు అందేలా, అన్ని రిజర్వేషన్లు సక్రమంగా అమలు కావడం కోసం ఆప్కాస్‌ ఏర్పాటు చేస్తున్నాం. దీని వల్ల మంచి జరుగుతుందని భావిస్తున్నాము. దీన్ని సక్సెస్‌ చేయడం కోసం కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలి'' అని జగన్ ఆదేశించారు. 

click me!