ప్రత్యేక విమానం డిల్లీకి వైసిపి ఎంపీలు... చీటింగ్ కేసు పెట్టాలి: కాల్వ శ్రీనివాసులు

By Arun Kumar PFirst Published Jul 3, 2020, 12:49 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లోని బీసీలను అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని..మొన్న అచ్చెన్నాయుడు నేడు కొల్లు రవీంద్రలపై కక్షసాధింపు ఇందులో భాగమేనన్నారు టిడిపి సీనియర్ నాయకులు కాల్వ శ్రీనివాసులు.

గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లోని బీసీలను అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని...మొన్న అచ్చెన్నాయుడు నేడు కొల్లు రవీంద్రలపై కక్షసాధింపు ఇందులో భాగమేనన్నారు టిడిపి సీనియర్ నాయకులు కాల్వ శ్రీనివాసులు. ప్రభుత్వ నిరంకుశ పాలనను ప్రజల్లో ఎండగడుతున్నారని బలహీన వర్గానికి చెందిన మరో నాయకుడు కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇలా వేధించటం చాలా దుర్మార్గమన్నారు.

''ఏపీలో పగ, ప్రతీకార రాజకీయం పరాకాష్టకు చేరింది. ఏ నియంత పాలనలో లేని విద్వేషం, కక్షసాధింపు రాజ్యమేలుతుంది. అధికారం శాశ్వతం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల మేలు కొరకు వినియోగించకుండా ప్రతిపక్షాన్ని దెబ్బతీయడానికి, ప్రజాస్వామ్యాన్ని అణగతొక్కడానికి, అంతం చెయ్యడానికి ఉపయోగించడం దేశ చరిత్రలో ఎక్కడా  లేదు'' అని అన్నారు.  

''రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నించడం జగన్ ఫ్యాక్షన్ మనస్తత్వానికి అద్దం పడుతుంది. మొన్న అచ్చెన్నాయుడుపై నేడు కొల్లు రవీంద్ర ఇలా బీసీ వర్గానికి చెందిన బలమైన నాయకులపై అక్రమ కేసులు, దౌర్జన్యాలు చేసి భయబ్రాంతులకు గురి చేసి బడుగు బలహీన వర్గాలను అణచివేతకు గురి చేస్తున్నారు''  అని మండిపడ్డారు. 

read more  ఆరోగ్యశ్రీ కింద కరోనా చికిత్స...: ఎంపీ విజయసాయి రెడ్డి

''ఒక వైపు ఆర్టీసీ, విద్యుత్‌, మద్యం, ఇసుక, రేషన్  ధరలు పెంచుతూ ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్నారు. సరికొత్త  పరోక్ష పన్నులతో ప్రజలనెత్తిన భారాన్ని మోపుతున్నారు. మరో వైపు ప్రతిపక్ష నేతలపై అక్రమకేసులతో వేధిస్తున్నారు'' అని అన్నారు. 

''ప్రత్యేకహోదా తెచ్చి ప్రతి గ్రామాన్ని మరొక హైదరాబాద్ చేస్తానన్నాడు. నేడు వైకాపా ఎంపీలు స్వప్రయోజనాల కోసం ప్రజాసొమ్ముతో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు. ఏనాడైనా ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని ప్రశ్నించేందుకు వెళ్లారా?  ఈ రోజు హోదాపై నోరు మెదపని వైకాపా నేతల పై చీటింగ్ కేసులు నమోదు చేయాలి''  అని కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

click me!