జగన్‌కు బాబు కౌంటర్: కాపుల రిజర్వేషన్లపై తోక ముడిచారు

First Published Aug 1, 2018, 5:36 PM IST
Highlights

యాభై శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రకటించిన జగన్... ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో తోకముడిచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు. 
 

అనంతపురం: యాభై శాతం దాటితే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రకటించిన జగన్... ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడంతో తోకముడిచారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  అభిప్రాయపడ్డారు. 

అనంతపురం జిల్లాలోని పేరూరు ప్రాజెక్టుకు  నీటిని విడుదల చేసే కాల్వకు బుదవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన గ్రామదర్శిని సభలో ఆయన ప్రసంగించారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్  పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రిజర్వేషన్ల విషయమై  జగన్  వైఖరి తేటతెల్లమైందన్నారు. 

ఏపీకి న్యాయం జరుగుతోందనే ఉద్దేశ్యంతోనే ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకొన్నట్టు చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.  ఏపీకి న్యాయం చేస్తారనే నమ్మకంతో నాలుగేళ్ల పాటు ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతోనే  ఎన్డీఏ నుండి బయటకు వచ్చినట్టు ఆయన చెప్పారు. 

 విభజన హామీలపై వైసీపీ, జనసేన ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. తనది యూటర్న్‌ కాదని, రైట్‌ టర్న్అని చంద్రబాబు స్పష్టం చేశారు. అడ్డదారుల్లో వెళ్తూ తనను విమర్శిస్తారా అంటూ మరోసారి ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతోపాటు అన్ని డిమాండ్లు సాధించుకుంటామని, కడప స్టీల్‌ప్లాంట్‌ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ అవగాహన లేని పార్టీ. నాలుగు ఓట్లు వేస్తే కేసుల మాఫీ కోసం ఉపయోగిస్తారు. అవగాహన లేని నాయకులు రాజకీయాలు చేస్తే లాభం లేదు. నేను ఎవరికీ భయపడను. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని చంద్రబాబు చెప్పారు.

 అవినీతి పార్టీని నమ్ముకుని  ప్రధాని మోడీ నీతులు మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు. అవినీతిని ప్రక్షాళన చేస్తానని ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేస్తామని చెప్పారని, వైసీపీ కేసులు ప్రధానికి కనబడలేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

ప్రజలు మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర రాజకీయాలు చేస్తే సహించేది లేదని, కేంద్రంతో విరోధం పెట్టుకుంటే జైలులో ఉండాల్సి వస్తుందని కొందరు భయపడుతున్నారని, జైలు భయంతోనే కేంద్రానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. 

ఈ వార్తలు చదవండి:కాపు రిజర్వేషన్లపై జగన్ మాట మార్చారు: చంద్రబాబు

పవన్ అంటే గౌరవం, కానీ అందుకే బాధ: లోకేష్
జగన్ వ్యాఖ్యల ఎఫెక్ట్: కాపులకు రిజర్వేషన్లపై నిపుణులతో పవన్ చర్చలు

click me!