బిజెపి-జనసేన, బిజెపి-వైసిపి... ఏపీ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది : సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Mar 23, 2023, 12:18 PM IST
Highlights

ఏపీ రాజకీయాలపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బిజెపి-జనసేన పొత్తు, బిజెపి-వైసిపి ఒక్కటేనంటూ జరుగుతున్న ప్రచారంపై వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. 

అమరావతి : 'ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపికి బలం లేదు... కానీ రాష్ట్రంలో అత్యంత బలమైన పార్టీ బిజెపి. ఎలాగంటే అధికార వైసిపి సహా ప్రతిపక్ష టిడిపి, జనసేన కూడా బిజెపి మద్దతిచ్చేవే కదా'   గతంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నమాటలు. ఆయన అన్నట్లుగానే ప్రస్తుతం ఏపీ రాజకీయాలు బిజెపి చుట్టూ తిరుగుతున్నాయి. జనసేనతో బిజెపి పొత్తు వుంది... ఇక మిగిలిన వైసిపి, టిడిపి పార్టీలు కూడా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపితో సన్నిహితంగా వుంటున్నాయి. కాబట్టి ఏపీ రాజకీయాల్లో బిజెపి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నాయకులు పొత్తులపై చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఏపీలో బిజెపి-జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందా..? అధికార వైసిపిని ఓడించేందుకు టిడిపి-జనసేన దగ్గరవుతాయా? అన్న ప్రశ్నలు రాజకీయ నాయకుల్లోనే కాదు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఈసారి చీలిపోనివ్వం అంటూ మాట్లాడుతున్నారు... అంటే ఈసారి టిడిపి-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్ళే అవకాశాలున్నాయా అన్న అనుమానం కలుగుతుంది. ఇదే సమయంలో బిజెపి నాయకులు టిడిపితో కలిసే ప్రసక్తే లేదు... కానీ జనసేనతో మాత్రం పొత్తు కొనసాగుతుందని అంటున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీల పొత్తులపై స్ఫష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. 

ఇదిలావుంటే ఇటీవల ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలతో బిజెపి-జనసేన దూరమయ్యేలా కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఘోర ఓటమిని చవిచూసారు... ఈ క్రమంలో జనసేన తమకు ఏమాత్రం సహకరించలేదన్న మాధవ్ మాటలు రాజకీయాలను హీటెక్కించాయి. ఈ మాటలతో బిజెపి-జనసేన ఇక విడిపోయినట్లేనని... అందువల్లే మాధవ్ ఇంత ఓపెన్ గా ఈ కామెంట్స్ చేసారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో  ఏపీ బిజెపి అధ్యక్షుడు వీర్రాజు ఉగాది రోజు చేసిన వ్యాఖ్యలు కన్ఫ్యూజన్ సృష్టించాయి. 

Read More  నిన్న మాధవ్, ఈరోజు వీర్రాజు.. ఆ మాటల్లో ఆంతర్యం ఏంటీ, జనసేనతో బీజేపీ కటీఫేనా..?

బిజెపి-జనసేన, బిజెపి-వైసిపి రాజకీయ సంబంధాలపై సోము వీర్రాజు స్పందించారు. బిజెపికి జనసేన దూరమవుతోందని ప్రచారం జరుగుతోందని... అందులో ఏమాత్రం నిజం లేదని వీర్రాజు అన్నారు. కొందరు బిజెపి-జనసేన పార్టీలు విడిపోవాలని కోరుకుంటున్నారని... వారి కోరిక నెరవేరదని అన్నారు. ఇక బిజెపి-వైసిపి ఒక్కటే అనేది అపోహ మాత్రమేనని... ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల ప్రచారమేనని వీర్రాజు అన్నారు. వైసిపి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సన్నిహితంగా వుండటం... ప్రతిసారి మద్దతివ్వడంతో ఈ రెండు పార్టీలు  ఒక్కటేనని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వీర్రాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు. 

ఇదిలావుంటే జనసేనతో పొత్తు వున్నా లేనట్లే... తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమతో జనసేన కలిసి రాలేదన్నారు బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు వున్నాయని.. కానీ తాము మాత్రం పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని మాధవ్ స్పష్టం చేశారు. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు వుందని ప్రజలు నమ్ముతారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహకరించాల్సిందిగా తాము పవన్‌ని కోరామని.. ఆయనే స్పందించలేదని మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన వైసీపీని ఓడించమని చెప్పింది కానీ, బీజేపీని గెలిపించమని చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీల అధ్యక్షులు కలిసే వున్నామని చెబుతున్నా.. కార్యకర్తలు మాత్రం కలిసిలేరని మాధవ్ స్పష్టం చేశారు.  

మాధవ్ వ్యాఖ్యలు బిజెపి-జనసేన పార్టీల మధ్య దూరం ఏ స్థాయిలో వుందో తెలియజేసాయి. కానీ తాజాగా వీర్రాజు మాత్రం బిజెపి-జనసేన దూరం కాలేవంటూ నష్టనివారణ వ్యాఖ్యలు చేసారు. ఏదేమైనా ఏపీలో బలం లేకపోవచ్చు... కానీ రాష్ట్ర రాజకీయాలు బిజెపి చూట్టూ తిరుగుతున్నాయనేది అర్థమవుతుంది. 

click me!