ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిపికేషన్: సోమవారం నాడు ఎన్నిక

By narsimha lodeFirst Published Sep 16, 2022, 10:56 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ సాయంత్రం వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. సోమవారంనాడు కొత్త డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. కోన రఘుపతి రాజీనామాతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు శుక్రవారం నాడు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ సాయంత్రం వరకు డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు గడువు ఉంది., సోమవారం నాడు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన పదవికి గురువారం నాడు రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ నిన్ననే ఆమోదించారు.  దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవిని మరొకరికి కేటాయించాలని వైసీపీ నాయకత్వం భావిస్తుంది. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవికి కోన రఘుపతి రాజీనామా చేశారు. 

also read:ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రాజీనామా

బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇటీవలనే బ్రహ్మణ కార్పోరేషన్ చైర్మెన్ పదవిని ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తప్పించాలని కూడా వైసీపీ నాయకత్వం భావించింది. ఈ తరుణంలోనే విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉంది. ఇవాళ మధ్యాహ్నం కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్ పదవికి  నామినేషన్ దాఖలు చేయనున్నారు.

మంత్రివర్గంలో ఆర్యవైశ్య  సామాజిక వర్గానికి చోటు దక్కలేదు. గతంలో ఇదే సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉండేవారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో వెల్లంపల్లి శ్రీనివాస్ చోటు కోల్పోయారు. దీంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన కోలగట్ల వీరభద్రస్వామికి  డిప్యూటీ స్పీకర్ గా పదవిని కట్టబెట్టాలని వైసీపీ సర్కార్ భావిస్తుందని సమాచారం. 

click me!