కడప స్టీల్ ప్లాంట్: ఏపీ అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం

By narsimha lode  |  First Published Sep 16, 2022, 10:10 AM IST

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ముందుకు సాగకపోవడంపై టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరును విమర్శించారు. శుక్రవారం నాడు ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయమై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. టీడీపీ సభ్యులకు మంత్రులు ధీటుగా సమాధానం చెప్పారు. 


అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని టీడీపీ శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నాడు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను స్పీకర్ తమ్మినేని సీతారాం చేపట్టారు.  కడప స్లీల్ ప్లాంట్ పై టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.ఈ సందర్భంగా టీడీపీ శాసనసభ పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏ దశలో ఉందో చెప్పాలని కోరారు. 

తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. అయితే అదే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు  అవుతున్నా ఒక్క అడుగు కూడా  ఫ్యాక్టరీ నిర్మాణ పనులు సాగడం లేదన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ ప్రకటించిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు 

Latest Videos

undefined

లిబర్టీ స్టీల్ కు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని అప్పగించారన్నారు..లిబర్టీ స్టీల్ సంస్థ దివాళా తీసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అనేక సంస్థలు పోటీపడినా కూడా లిబర్టీ సంస్థకు ఎందుకు  నిర్మాణ పనులు కట్టబెట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని టీడీపీ శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు కోరారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడ ప్రారంభించలేదని ఆయన విమర్శించారు. మరో వైపు విశాఖలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నా కూడా ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. అయితే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించే మాట్లాడాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. సబ్జెక్ట్ నుండి పక్కకు వెళ్లవద్దని ఆయన అచ్చెన్నాయుడును కోరారు. ఇదే విషయమై టీడీపీ సభ్యుడు బాలవీరాంజనేయులు కూడా ప్రభుత్వ తీరును విమర్శించారు. సీఎం స్వంత జిల్ల్లాలోనే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పనులు ప్రారంభం కాలేదన్నారు.

  ఈ సమయంలో ఏపీ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు పరిహరం చెల్లించినట్టుగా చెప్పారు. 480 ఎకరాలకు రూ. 37 కోట్లు పరిహరం చెల్లించినట్టుగా మంత్రి  తెలిపారు.   ఏపీ పునర్విభజన చట్టంలో  ఈ ఫ్యాక్టరీ గురించి ఏమి చెప్పారో చట్టం చదువుకోవాలని టీడీపీ సభ్యులకు మంత్రి సూచించారు. .

 కచ్చితంగా ఈ ఫ్యాక్టరీని కడపలో ఏర్పాటు చేయాలని ఏపీ పునర్విభజన చట్టంలో లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఐదేళ్లలో ఎందుకు పనులు చేయలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

 కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం జాయింట్ వెంచర్ కోసం ప్రభుత్వం వెతికిందన్నారు. ఒకవేళ జాయింట్ వెంచర్ కోసం ఎవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని  బడ్జెట్ లో రూ. 250 కోట్లు కేటాయించినట్టుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గుర్తు చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల ముందే రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు సర్కార్ రాయలసీమ స్టీల్ ప్లాంట్ విషయమై నోటిపై చేశారని మంత్రి విమర్శించారు.

also read:ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర: అమరావతి రైతుల యాత్రపై జగన్ ఫైర్

ఇదే ప్రశ్నపై టీడీపీ సభ్యుడు బాలవీరాంజనేయులు మరోసారి మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి క్రాస్ టాక్ చేయడంపై టీడీపీ సభ్యుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఈ విషయమై మాట్లాడారు.కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో అభివృద్దికి టీడీపీ అడ్డుపడుతుందని ఆయన విమర్శించారు.

 

 

click me!