
ఆనం బ్రదర్స్ ను చూస్తుంటే జిల్లాలో అందరూ పాపం అనుకుంటున్నారు. వీళ్ళని చూసి ‘ఒకపుడు వీళ్ళేనా జిల్లాలో ఓ వెలుగు వెలిగింద’ని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, కాంగ్రెస్ హయాంలో సోదరులిద్దరూ ఏ స్ధాయిలో వెలిగిపోయారో అందరికీ తెలిసిందే. ‘బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయ’న్న సామెత ఇపుడు వీరికి సరిగ్గా సరిపోతుంది.
ఎందుకంటే, పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సోదరులు ఓడిపోయారు. తర్వాత టిడిపిలో చేరారు. అప్పటి నుండే వాళ్ళకు కష్టాలు మొదలయ్యాయి. వైసీపీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు కలిసిరాలేదు. దాంతో టిడిపిలో చేరాల్సి వచ్చింది. పచ్చ కండువా కప్పేముందు రామనారాయణరెడ్డికి ఎంఎల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చంద్రబాబు హామీని చూసుకుని జగన్ పై ఎగిరెగిరి పడ్డారు. జగన్ పైన వివేకానందరెడ్డి చాలా నీచమైన వ్యాఖ్యలే చేసారు. కొంత కాలం తర్వాత వీరిద్దరినీ చంద్రబాబు పూర్తిగా దూరం పెట్టేసారు. దాంతో అప్పటి నుండి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. అదే సమయంలో జిల్లాలో కూడా టిడిపి నేతలనుండి వీరికి అవమానాలే ఎదురౌతున్నాయి. అందుకని జిల్లాలో కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు.
అంటే జిల్లాలో టిడిపి నేతలు దగ్గరకు రానీయటం లేదు. చంద్రబాబూ వీరిని కలవటానికి ఇష్టపడటం లేదు. ఈ పరిస్ధితిల్లో తమలో తామ బాధపడటం తప్ప ఏం చేయలేకున్నారు. అందుకనే సోదరులు జిల్లాలో కనిపించి మూడు నెలలైందట. ఇటీవలే తమను హైదరాబాద్ లో కలసిన మద్దతుదారులతో వివేక పై విషయాలన్నీ చెప్పుకుని బాధపడిపోయారట. తమను చంద్రబాబు దారుణంగా మోసగించారంటూ భోరుమన్నంత పనిచేసారట. ఆనోటా ఈనోటా జిల్లాలోని జనాలకు ఈ విషయం తెలిసి ‘పాపం ఆనం సోదరులు’ అని అనుకుంటున్నారు.