తిరుమల వెంకన్న సన్నిధిలోనే రోజాకు షాక్ ... శ్రీవారి సేవకులే వదిలిపెట్టలేదుగా... (వీడియో)

By Arun Kumar PFirst Published Feb 2, 2024, 11:45 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజాకు అమరావతి నిరసన సెగ తగిలింది. తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లిన ఆమెను అమరావతి మహిళలు చుట్టుముట్టి నిరసన తెలిపారు. 

తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ కొన్నేళ్ళుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. వైసిపి సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అమరావతి ప్రాంతంలో ప్రజా ఉద్యమం సాగుతోంది. తాజాగా ఈ నిరసనలు తిరుమల వెంకన్న సన్నిధికి చేరాయి. శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రి రోజాకు అమరావతి నిరసన సెగ తాకింది. 

మంత్రి రోజా తరచూ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.  ఇలా తాజాగా తిరుమలకు వెళ్లిన ఆమె విఐపి దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం నుండి బయటకు వచ్చిన రోజాతో ఫోటోలు దిగేందుకు కొందరు శ్రీవారి సేవకులు ప్రయత్నించారు. ఇంతలోనే మరికొందరు మహిళలు మంత్రి వద్దకు చేరుకుని జై అమరావతి నినాదాలు చేయడం ప్రారంభించారు. అంతేకాదు  రోజాను కూడా నినాదాలు చేయాలని కోరగా ఆమె నవ్వుకుంటూనే ముందుకు కదిలారు. ఆ మహిళలు మాత్రం అలాగే జై అమరావతి నినాదాలు చేసారు.

వీడియో

ఇదిలావుంటే రాజధాని కోసం అమరావతి మహిళలు, రైతులు చేస్తున్న ఉద్యమం ఇటీవలే 1500 రోజులను పూర్తిచేసుకుంది. 2019 డిసెంబర్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు వుంటాయని... అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే  విశాఖపట్నంను పాలన, కర్నూల్ ను న్యాయ రాజధానిగా ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అమరావతి ప్రజలు ఆందోళనల బాట పట్టారు. 

తమ బిడ్డల భవిష్యత్ బాగుంటుందని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులు వైసిపి ప్రభుత్వ నిర్ణయంతో కంగుతిన్నారు. అంతేకాదు తమ ప్రాంత అభివృద్దిపై ఎన్నో ఆశలు పెంచుకున్న స్థానికులు కూడా మూడు రాజధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.   దీంతో రోడ్డుపైకి వచ్చిన అమరావతి ప్రజలు నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు, పాదయాత్రలు, నిరాహార దీక్షలు ఇలా చేయని కార్యక్రమం లేదు. అయినా వైసిపి ప్రభుత్వం మాత్రం రాజధానుల నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా పాలనను విశాఖకు తరలించే ఏర్పాట్లు చేసుకుంటోంది. 

Also Read  బుద్ధా వెంకన్న హడావుడి.. నేనూ వున్నానంటూ జలీల్ ఖాన్, పోతిన మహేష్ అలక.. హాట్ హాట్‌గాబెజవాడ ‘‘ వెస్ట్‌ ’’
 
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ప్రతిపక్ష బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కోరుతున్నాయి. అధికారంలోకి వస్తే మూడు రాజధానుల అంశాన్ని పక్కనబెట్టి అమరావతి నుండే పాలన సాగిస్తామని టిడిపి-జనసేన కూటమి హామీ ఇస్తోంది. ఇదే సమయంలో అమరావతిలోనే అభివృద్దిని కేంద్రీకృతం చేయకుండా ఉత్తరాంధ్ర,రాయలసీమ అభివృద్దికి కృషిచేస్తామని అంటున్నారు. 

ఇలా ప్రతిపక్షాలు అమరావతి ఉద్యమానికి మద్దతివ్వగా పాలకపక్షం మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుకే సిద్దమయ్యింది. దీంతో అమరావతి ప్రజలు అవకాశం చిక్కినప్పుడల్లా వైసిపి నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఇలా తాజాగా తిరుమలలో మంత్రి రోజాకు అమరావతి నిరసన సెగ తగిలింది. 

click me!