AP Assembly Session 2024 Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
AP Assembly Session 2024 : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మూడు రోజుల పాటు మధ్యంతర బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఫిబ్రవరి 5న గవర్నర్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. మొదటి రోజే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. తదనంతరం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో మధ్యంతర బడ్జెట్‌పై చర్చలు జరగనున్నాయి.
ప్రభుత్వం ఆమోదం కోసం వివిధ బిల్లులకు ముఖ్యమైన సవరణలను కూడా సమర్పించనుంది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. దీని తరువాత సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ (Business Advisory Committee) సమావేశంలో నిర్ణయించనున్నారు.
కాగా, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులో వెలువడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. అధికార వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా ఖరారు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ తరుణంలో వైఎస్‌ఆర్‌సికి మరింత పెద్దఎత్తున మద్దతు లభించే లక్ష్యంతో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్‌లో ఎన్నికల ప్రణాళికను ప్రకటించనుందని ఆ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు రెండేళ్లపాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి ఆమోదం తెలిపింది. అదే సమయంలో విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. పలు శాఖల్లో పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.
మరోవైపు.. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం వంటి పథకాలను తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. వైఎస్ఆర్సీ కూడా అలాంటి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీని కూడా బడ్జెట్ సెషన్‌లో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశం ఉంది. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలుగుదేశం లక్ష్యంగా పెట్టుకుంది.