నేనేం వాడుకోలేదు: ఏబీ వెంకటేశ్వర రావు తనయుడు చేతన్ సాయికృష్ణ స్పందన ఇదీ...

By telugu teamFirst Published Feb 11, 2020, 10:42 AM IST
Highlights

తనపై వచ్చిన ఆరోపణల మీద ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు తనయుడు చేతన్ సాయికృష్ణ స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని చేతన్ చెప్పారు.

అమరావతి: తనపై వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు తనయుడు చేతన్ సాయికృష్ణ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  ఏపీ ప్రభుత్వానికి సంబంధించి తాను ఏ టెండర్ల లోను పాల్గొనలేదని స్పష్టం చేశారు. 

ప్రభుత్వం చేసిన అభియోగాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పారు. తాను చేసినది ప్రయివేట్ స్టార్ట్ అప్ లు తప్ప ఏ ప్రభుత్వానికి సంబందించిన టెండర్ల లో పాల్గొన లేదని ఆయన అన్నారు. తన తండ్రి బాధ్యత కల్గిన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయని, కాబట్టి తాను ఈ ప్రకటన ఇస్తున్నానని చెప్పారు.

Also Read: నిజమా?: బాబుతో కలిసి కుట్ర, కుమారుడికి ఏబీ వెంకటేశ్వర రావు కాంట్రాక్ట్

ఇకనైనా తమపై చేస్తోన్న విష ప్రయోగాలు ఆపాలని ఆయన కోరారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువునష్టం నష్టం దావా వేయడం తప్ప తనకు వేరే మార్గాలు లేవని ఆయన హెచ్చరించారు. తాను అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేసి అక్కేడ మూడేళ్లు ఉద్యోగం చేసి ఇండియాలోనే స్థిరపడాలని 2017 ఏప్రిల్ లో తిరిగి వచ్చానని ఆయన చెప్పారు. 

తాను హైదరాబాదులో పుట్టి పెరిగానని, ఆంధ్రప్రదేశ్ తన పితృభూమి అని, ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా బతకాలని అనుకున్నానని, తాను చేద్దామనుకున్న వ్యాపారానికి హైదరాబాద్ అనువైన చోటు అయినప్పటికీ కొత్త రాష్ట్రంలో కొంచెం ఆలస్యమైనా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయని, కుటుంబానికి దగ్గరలో ఉండవచ్చుననని అనుకుని తాను విజయవాడలో 2017 మే నెలలో ఓ కంపెనీని రిజిష్టర్ చేసి సార్టప్ ప్రారంభించానని ఆయన వివరించారు. 

Also Read: ఏబీ వెంకటేశ్వరరావుపై కక్ష సాధింపు: జగన్‌కు బాబు హితవు

అప్పటి నుంచి 2019 అక్టోబర్ వరకు ఇతర స్టార్టప్ లు స్థాపించడం, కొన్నిటిలో భాగస్వామి ఉండడం వాస్తవమని, ఇవేవీ షెల్ కంపెనీలు కావని, కొన్నింటిలో అవకాశాలు కనిపించక, కొన్నింటిలో తనకు సమయం లేక ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన చెప్పారు. స్టార్టప్ లు అలాగే ఉంటాయని, అన్నీ సక్సెస్ కావని, అన్నీ ముందుకు పోవని, రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన కంపెనీలు అన్నింటికీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నానని ఆయన వివరించారు. 

తాను ఇంతవరకు ఏ ప్రభుత్వంతో గానీ ఏ ప్రభుత్వ శాఖతో గానీ ఆంధ్రప్రదేశ్ లో గానీ లేక ఇతర ఏ రాష్ట్రంలో గానీ ఏ రకమైన వ్యాపారం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు చేసిందంతా ప్రైవేట్ సెక్టార్ లోనే అని ఆయన చెప్పారు. తన తండ్రిని ఉపయోగించుకుని ఏనాడు కడా వ్యాపారం చేయడం గానీ లాభం పొందడం గానీ చేయలేదని ఆయన చెప్పారు. 

click me!