చంద్రబాబు కోటరీ: వారికి చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్

By narsimha lodeFirst Published Feb 10, 2020, 6:20 PM IST
Highlights

చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టిన అధికారులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జగన్ సర్కార్ చంద్రబాబుకు సన్నిహితంగా మెలిగిన అధికారులపై  చర్యలు తీసుకొంటుంది. 


అమరావతి:చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టిన అధికారులు ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కూడ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక వైసీపీ ప్రభుత్వ టార్గెట్‌ ఎవరనే చర్చ సాగుతోంది.

Also read:నిజమా?: బాబుతో కలిసి కుట్ర, కుమారుడికి ఏబీ వెంకటేశ్వర రావు కాంట్రాక్ట్

ఏపీ రాష్ట్రంలో టీడీపీ ఓటమి పాలైన తర్వాత  చంద్రబాబు హయంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను జగన్ సర్కార్ పక్కన పెట్టింది. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో  వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టిన అధికారులపై ప్రస్తుతం  జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. అధికారులపై జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని  టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.

గత ఏడాది డిసెంబర్ మాసంలో ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు రావడంతో కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరో వైపు అవినీతి ఆరోపణలపై సీఐడీ కేసు కూడ నమోదు చేసింది.

జాస్తి కృష్ణ కిషోర్  ప్రభుత్వం తనను సస్పెన్షన్ విధించడంపై  కోర్టును ఆశ్రయించారు. ఇక తాజాగా ఐపీఎస్ అధికారి  ఏబీ వెంకటేశ్వరరావును కూడ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 8 మాసాలుగా ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా కొనసాగాడు.

23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారని అప్పట్లో వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది.  సెక్యూరిటీ పరికరాల కొనుగోలు వ్యవహరంలో  ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని ప్రభుత్వం ఆరోపణలు చేసింది.

ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణలపై చట్టపరంగా  ఎదుర్కొనే విషయాన్ని పరిశీలించనున్నట్టుగా ఏబీ వెంకటేశ్వరరావు కూడ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఏబీ వెంకటేశ్వరరావు తర్వాత నెక్ట్స్ ఏ అధికారిపై సర్కార్ గురి పెడుతోందో అనే విషయమై చర్చ సాగుతోంది.

మరో ఐపీఎస్ అధికారిపై కూడ వైసీపీ ఆ సమయంలో తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి  ప్రమోషన్లను ఇచ్చారని కూడ ఆ సమయంలో వైసీపీ విమర్శలు చేసింది. ప్రత్యేకించి కొందరు ఐపీఎస్ అధికారుల పేర్లను కూడ ఉటంకిస్తూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది.

అయితే గతంలో ఆరోపణలు చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకొని వైసీపీ సర్కార్ పనిచేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ పద్దతి సరైంది కాదని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ విమర్శలు చేసిన అధికారులు ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళనలో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.
 

click me!