Road Accidents: 2022లో దేశంలో నమోదైన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 72.3 శాతం రాష్ డ్రైవింగ్ వల్ల, 2.2 శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల, 1.6 శాతం డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ల వాడకం వల్ల, 18.2 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నాయి.
The Road Accidents in India-2022 Report : విజయవాడలో రోడ్డు ప్రమాద మరణాలు 46 శాతం పెరిగాయనీ, విశాఖపట్నంలో గత ఏడాదితో పోలిస్తే 2022లో 2.7 శాతం తగ్గుదల నమోదైందని 'భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు-2022' డేటాను ఊటంకిస్తూ కేంద్ర రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ రవాణా విభాగం వెల్లడించింది. గత ఏడాది విజయవాడలో 1,543 రోడ్డు ప్రమాదాల్లో 418 మంది మరణించగా, 2021లో 287 మంది మరణించారు. ఇదే సమయంలో విశాఖపట్నంలో 2022లో 1,531 రోడ్డు ప్రమాదాల్లో 358 మంది మరణించగా, పోయిన సంవత్సరం 368 మంది మరణించారు.
2022లో దేశవ్యాప్తంగా 50 నగరాల్లో రోడ్డు ప్రమాద మరణాల్లో విజయవాడ 13వ స్థానంలో, వైజాగ్ 18వ స్థానంలో ఉన్నాయని కేంద్రం డేటా వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రంలో కేవలం 1.4 శాతం తగ్గుదల నమోదైందని, అయితే ఇదే సమయంలో మరణాలు స్వల్పంగా 1.3 శాతం పెరిగాయని తెలిపింది. 2022లో 21,249 రోడ్డు ప్రమాదాల్లో 8,293 మంది మరణించారనీ, 2021లో 21,556 రోడ్డు ప్రమాదాల్లో 8,186 మరణాలు నమోదయ్యాయని డేటా వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించిన గాయాలలో ఆంధ్ర ఏడో స్థానంలో, మరణాల్లో ఎనిమిదో స్థానంలో, దేశవ్యాప్తంగా గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలు, రహదారి పరిస్థితులు, వాహనాల పరిస్థితులు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ల వినియోగం, రెడ్ లైట్లను పట్టించుకోకుండా రోడ్లుపై వెళ్లడం, ప్రయాణ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల సంభవిస్తున్నాయని నివేదిక హైలైట్ చేసింది. 2022లో దేశంలో నమోదైన మొత్తం ప్రమాదాల్లో 72.3 శాతం రాష్ డ్రైవింగ్ వల్ల, 2.2 శాతం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల, 1.6 శాతం డ్రైవింగ్ లో మొబైల్ ఫోన్ల వాడకం వల్ల, 18.2 శాతం ఇతర కారణాల వల్ల జరుగుతున్నాయి.