Drought Zones: వర్షాభావ పరిస్థితులతో పంటనష్టం జరిగి రూ. 10 లక్షల అప్పుల భారంతో శ్రీకాంత్ అనే రైతు ఆత్మహహత్య చేసుకున్నాడనీ, గత మూడేళ్లుగా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు రాష్ట్రంలోని వైఎస్ఆర్సీసీ ప్రభుత్వ పేద, ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. కరువు బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
Andhra Pradesh Drought mandals: నైరుతి రుతుపవనాలు-2023 (ఖరీఫ్)లో లోటు వర్షపాతం కారణంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని 103 మండలాలను కరువు పీడిత మండలాలుగా ప్రకటించారు. వీటిలో ఆరు జిల్లాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం మండలాల్లో 80 మండలాలు తీవ్ర ప్రభావిత మండలాలుగా, 23 మండలాలు మోస్తరు ప్రభావిత మండలాలుగా గుర్తించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 28, కర్నూలు జిల్లాలో 24, శ్రీసత్యసాయి జిల్లాలో 21, అన్నమయ్య జిల్లాలో 18, నంద్యాలలో 6, చిత్తూరు జిల్లాలో 4 కరువు మండలాలు ఉన్నాయి. ఇవన్నీ రాయలసీమ ప్రాంతంలోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం కరువు మండలాలను నోటిఫై చేస్తూ రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ దీనికి సంబంధించిన జీవోను జారీ చేశారు.
రైతులు రుణ సదుపాయం పొందేందుకు, సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా గెజిట్ లో నిర్దిష్ట మండలాలు లేదా ప్రాంతాలను నోటిఫై చేయాలని ఏడు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు, తాగునీరు, పశువులకు పశుగ్రాసం కొరత, భూగర్భ జలాలు పడిపోవడం, జీవనోపాధి అవకాశాలు లేకపోవడం, వలసల కారణంగా సాగు తగ్గడం వంటి అంశాల ఆధారంగా మండలాలను కరువు పీడిత మండలాలుగా గుర్తిస్తున్నట్లు అధికారులు వివరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కూలీలకు పనిదినాలను 100 నుంచి 150కి పెంచుతామని కర్నూలు జిల్లా కలెక్టర్ జి.సృజన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు.
undefined
కరువు రైతులను తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్..
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న రైతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఇదే విషయం గురించి మాట్లాడుతూ.. 400 మండలాలు కరువు బారిన పడినప్పటికీ ప్రభుత్వం 103 మండలాలను మాత్రమే కరువు పీడిత మండలాలుగా ప్రకటించిందని అన్నారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమలపాడు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు శ్రీకాంత్ నివాసాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి రుద్రరాజు సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ తరపున పీసీసీ చీఫ్ శ్రీకాంత్ కుటుంబసభ్యులకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. వైకాపా సర్కారు తీరు కారణగా అప్పుల భారంతో శ్రీకాంత్ ప్రాణాలు తీసుకున్నాడని పేర్కొన్నారు.
శ్రీకాంత్ పత్తి, మిర్చి సాగుచేశాడని, వర్షాభావ పరిస్థితులతో పంటలు నష్టపోయాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వెంటనే మండలాల్లో కరువు పరిస్థితులను అంచనా వేసి రైతులకు అవసరమైన సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే, గత మూడేళ్లుగా పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు రాష్ట్రంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పేద, ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 685 మండలాల్లో 400 మండలాలు రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్నా ప్రభుత్వం కరువు రైతులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రుద్రరాజు వెంట ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, ఏపీసీసీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, సేవాదళ్ చైర్మన్ ఎలమందారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శంకర్, డీసీసీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్, పలువురు స్థానిక కార్యకర్తలు ఉన్నారు.