ప్రధాని మోడీ కృషి వల్లే ఏపీ అభివృద్ధి చెందుతోంది: దగ్గుబాటి పురందేశ్వరి

By Mahesh Rajamoni  |  First Published Nov 2, 2023, 10:39 PM IST

Daggubati Purandeswari: తిరుమలలోని పార్వేటి మండపాన్ని టీటీడీ బాధ్యతారాహిత్యంగా ధ్వంసం చేసిందని ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుపాటి పురందేశ్వ‌రి అన్నారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.1,695 కోట్లు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు కేటాయించింద‌ని తెలిపారు.  
 


Amaravati: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌ల్లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ది చెందుతోంద‌ని ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి అన్నారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏ అభివృద్ధి జరిగినా అదంతా ప్రధాని మోడీ కృషి వల్లే జరిగిందనీ, అందులో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర చాలా తక్కువని ఆమె పునరుద్ఘాటించారు. తిరుపతిలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కోఆర్డినేటర్ల సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికాభివృద్ధికి మోడీ పెద్దపీట వేశారన్నారు. "అయితే రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయాన్ని అంగీకరించడం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం ఏ విధంగా సాయం చేసిందో, ఏ విధంగా సహకరిస్తోందో ప్రజలకు వివరించేందుకు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాం. దీనిలో భాగంగా తొలి కార్యక్రమాన్ని తిరుపతిలో చేపట్టాము" అని తెలిపారు.

అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి అందించిన ప‌లు నిధుల అంశాల‌ను కూడా ఆమె ప్ర‌స్తావించారు. పూతలపట్టు-నాయుడుపేట హైవేను రూ.1,700 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్ ను ప్రపంచస్థాయిగా అభివృద్ధి చేసేందుకు రూ.311 కోట్లు ఖర్చు చేస్తున్నామని పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్ర, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ కోసం వ‌రుస‌గా రూ.600, రూ.800 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు రూ.1,695 కోట్లు కేటాయించామ‌న్నారు.

Latest Videos

ఇందుకోసం 87 రకాల కార్యక్రమాలను చేపట్టారు. తిరుపతికి 21 వేల మంచినీటి కనెక్షన్లు ఇచ్చారు. అభివృద్ధిలో భారత్ ను ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి తీసుకెళ్లేందుకు ప్రధాని మోడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి రాష్ట్రం దేశాభివృద్ధికి దోహదపడితేనే అది సాధ్యమవుతుందని పురందేశ్వ‌రి పేర్కొన్నారు. అంత‌కుముందు, తిరుమలలోని పార్వేటి మండపాన్ని టీటీడీ బాధ్యతారాహిత్యంగా ధ్వంసం చేసిందని ఆమె ఆరోపించారు. "అలిపిరిలోని శ్రీవారిపాదాల వద్ద ఉన్న 500 ఏళ్ల నాటి మండపాన్ని పునరుద్ధరించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. పార్వేటి మండపం మాదిరిగానే ఈ మండపం కూడా ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఏఎస్ఐ అనుమతి లేకుండా ఈ పురాతన మండపాన్ని తాకకూడదని" పేర్కొన్నారు.

click me!