Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు 4 ఏళ్ళ పాలనలోని 10 తప్పిదాలు ఇవే!

What could be the rating of AP CM Chandrababu Naidu

 

 

డిస్‌క్లెయిమర్: ఈ వ్యాసం చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయప్రస్థానం పూర్తిచేసుకున్న సందర్భంగా వస్తున్న పుంఖానుపుంఖాల పరంపరలోనిది కాదు. అలాగని ఇది వైసీపీ పార్టీవారి ప్రాపగాండా బ్యాచ్ సృష్టికూడా కాదు… వ్యాసం పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది. నిష్పక్షపాతంగా చంద్రబాబు నాలుగేళ్ళ పాలనను విశ్లేషించటాని చేసిన ప్రయత్నం.

 

చంద్రబాబు 1995లో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకోవటంలోగానీ, 1996లో కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ తో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించటంలోగానీ, 1999లో ఎన్డీఏతో పొత్తు పెట్టుకుని తిరిగి అధికారంలోకి రావటంలోగానీ - ప్రదర్శించిన రాజకీయ చతురత, వ్యవహారదక్షత అందరికీ తెలిసిందే. మరి నాటి ఆ సామర్థ్యం, దూకుడు ఏమయ్యాయోగానీ 2014లో అధికారంలోకి వచ్చిననాటినుంచి పరిశీలిస్తే, ఆయన వ్యవహారశైలి, తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టంగానూ, అవకతవకలుగానూ ఉంటున్నాయి. ముఖ్యంగా ఆయన చేసిన 'ఓటుకు నోటు కేసు' అనే ఒక్క తప్పిదం(blunder) తాలూకు మూల్యాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం భరించాల్సివస్తోంది. ఒకనాడు కేంద్రంలో చక్రం తిప్పిన ఆ బాబు ఇప్పుడు ఈ కేసు కారణంగా మోడి ముందు మోకరిల్లుతున్నారు. తద్వారా ఏపీకి ప్రత్యేక హోదా విషయంలోగానీ, ప్యాకేజి విషయంలోగానీ కేంద్రంనుంచి చట్టం ప్రకారం రావాల్సినవాటిని డిమాండ్ చేసే హక్కును(bargaining capacity) కోల్పోయి ఏపీ ప్రజలను నిట్టనిలువునా ముంచేశారు.

 

మరోవైపు ఈ కేసుకారణంగా చంద్రబాబు ఏపీ ప్రజలతోబాటు అటు తెలంగాణలో సొంత పార్టీ శ్రేణులకు కూడా తీవ్రమైన అన్యాయం చేశారని చెప్పాలి. ఈ కేసు నేపథ్యంలో, కేసీఆర్ పై పోరాడేటంత సాహసం చేయలేక అక్కడ ఎంతో బలమైన క్యాడర్ ఉన్న పార్టీ(గత ఎన్నికల్లో 15 స్థానాలు లభించాయి)ని చేతులారా నిర్వీర్యం చేసేశారు. ఇదే కాదు రాజధాని నిర్మాణం, పోలవరం వంటి పలు విషయాలలోనూ బాబు అనేక రాంగ్ స్టెప్స్ వేశారు. రాష్ట్రాన్ని గాడిలో పెడతానని ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన చంద్రబాబు ఇలా రాంగ్ ట్రాక్ లో నడవటానికి ఒకటే కారణంగా చెబుతున్నారు. ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నింటిలో పుత్రరత్నం లోకేష్ తో పాటు, అస్మదీయ వర్గంలోని కార్పొరేట్ శక్తులు, కంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల ప్రభావం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.  గత నాలుగేళ్ళ పాలనలో చోటుచేసుకున్న కీలక పరిణామాలను, జరిగిన తప్పిదాలను ఒకటొకటిగా పరిశీలిద్దాం.

What could be the rating of AP CM Chandrababu Naidu

 

 అమరావతి

 

విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నడపగల సామర్థ్యం, కొత్త రాజధాని నిర్మించగల దక్షత అనుభవజ్ఞుడైన చంద్రబాబుకే ఉందని భావించి 2014 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటాను, అహోరాత్రాలూ కష్టించి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానంటూ బాబు చెప్పిన సెంటిమెంట్ డైలాగులను జనం విశ్వసించారు. కానీ జరిగిందేమిటి, నాలుగేళ్ళ తర్వాత చూసుకుంటే అమరావతి - 'ఆలూ లేదు, చూలూ లేదు...' అన్న చందంగా ఉంది. రాజధాని ఎంపికే నెలల తరబడి జరిగింది. బాబు నిరంతరం జపించే 'పారదర్శకత' రాజధాని ఎంపికలో ఏమాత్రం కనిపించలేదు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి వద్ద కొన్ని మంచి ప్రత్యామ్నాయాలే ఉన్నప్పటికీ, బంగారం పండుతుందని చెప్పుకునే జరీబు భూములున్న అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశారు.

What could be the rating of AP CM Chandrababu Naidu

ఇక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉంటాయని, నది ఒడ్డున ఉంటే బాగా అభివృద్ధి జరుగుతుందనే కారణాలను బయటకు చెప్పుకొచ్చినప్పటికీ, ఈ నిర్ణయం వెనుక అస్మదీయ వర్గంలోని కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లు(సీఎంరమేష్ కు చెందిన రిత్విక్ కనస్ట్రక్షన్స్, యనమల వియ్యంకుడు పుట్టాసుధాకర్ యాదవ్ కు చెందిన పీఎస్కే ఇన్ఫ్రా, మేఘా ఇంజనీరింగ్), పారిశ్రామిక వేత్తలు, వ్యాపారవేత్తల స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దానికితోడు ఈ ఎంపిక నిర్ణయం ముందే తెలుసుకుని అస్మదీయ వర్గం అమరావతిని రాజధానిగా ప్రకటించేముందే ఆ ప్రాంతంలో వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి తీవ్రస్థాయి నేరానికి పాల్పడటం నిప్పునని చెప్పుకునే చంద్రబాబుకు తెలియకుండా మాత్రం జరగదు. ఇక రాజధాని నిర్మాణంకోసం భారీ స్థాయిలో 35 వేల ఎకరాలను భూ సమీకరణ విధానంలో తీసుకున్నారు. భారీ ఎత్తున విద్యావ్యాపారంచేసే ఎస్ఆర్ఎమ్, వీఐటీ వంటి అనేక విద్యాసంస్థలకు వందల ఎకరాలను నామమాత్రపు ధరలకు(ఎకరం భూమి మార్కెట్ ధర రు.2.50 కోట్లు ఉండగా రు.50 లక్షల చొప్పున) కట్టబెట్టారు. వారు ఆ భూమిని తాకట్టుపెట్టి ఎకరానికి 2-3 కోట్లు చొప్పున బ్యాంకులనుంచి అప్పులు తీసుకుంటారు. వైఎస్ హయాంలో సెజ్ ల పేరుతో వందల ఎకరాలను ఆయన అస్మదీయులకు ఉదారంగా పంచారన్న విమర్శ(ఉదా:అనంతపురంలో ఇందూ గ్రూప్ సెజ్ కు వైఎస్ ప్రభుత్వం 8,000 పైగా ఎకరాలను నామమాత్రపు ధరకు కేటాయిస్తే వారు ఆ భూమిని తాకట్టుపెట్టి ఎకరానికి రు.1-2 కోట్ల చొప్పున అప్పులు తీసుకున్నారు) బలంగా ప్రచారంలో ఉండగా, బాబు అదే తప్పును చేయటం గమనార్హం. అమరావతిలో ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థలకు పెద్ద ఎత్తున ఉదారంగా భూములను కేటాయించటంలో కూడా క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఒక ఉదాహరణను తీసుకుంటే, ఇండో యూకే అనే వైద్య సంస్థకు న్యూ చండీగఢ్ లో హెల్త్ సిటీలో అక్కడి ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయిస్తే, ఏపీ ప్రభుత్వం అదే సంస్థకు అమరావతిలో 150 ఎకరాలు కేటాయించింది. ఇక రాజధానిలోని కోర్ క్యాపిటల్ డిజైన్ల విషయానికొస్తే, అదొక పెద్ద ప్రహసనం. అసలే రాష్ట్రం నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటుంటే తాహతుకు మించిన స్థాయిలో ఇంటర్నేషనల్ లెవల్ నిర్మాణాల డిజైన్లకోసం చంద్రబాబు ఆరాటపడటం జవాబులేని ప్రశ్న. ఎందరో అంతర్జాతీయ ఆర్కిటెక్టులనుంచి డిజైన్లు తీసుకున్నారు. దేనినీ నిర్ధారించకుండా నెలల తరబడి కాలయాపన చేశారు. చివరికి సినీ దర్శకుడు రాజమౌళిని కూడా పిలిచారు… ఆయన తనకు దీనిమీద అవగాహన లేదు మొర్రో అని చెబుతున్నా వినకుండా. ఆ డిజైన్ల ఖరారు ఇంకా సాగుతూనే ఉంది. అది ఎప్పటికి ముగుస్తుందో ఆ దేవుడికే ఎరుక!

 

ప్రత్యేకహోదా

 

ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగుతాయని, నీతి ఆయోగ్ వద్దని సూచించిందనే కారణాలతో కేంద్రం ఈ హామీపై మాట తప్పింది. అయితే దీనిపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము గానీ, కేంద్రంలో ఉన్న ఇద్దరు మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించే ధైర్యంగానీ చంద్రబాబుకు లేవు. కనీసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళే సాహసంకూడా చేయలేకపోయారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజికి తలూపారు. అంతే కాకుండా హోదాయే సంజీవని కాదు అని, హోదా విషయంలో తాను రాజీ పడ్డాను కాబట్టే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణబాధ్యతను తీసుకోటానికి కేంద్రం అంగీకరించిందని కూడా బహిరంగంగా చెప్పారు. మళ్ళీ ప్రస్తుతం హోదాపై ఉద్యమం మొదలయ్యేటప్పటికి మాట మార్చారు. హోదా ఇవ్వాల్సిందేనని బాబు మాట్లాడుతున్నారు.  హోదా డిమాండ్ పతాకస్థాయికి చేరిన ప్రస్తుత సమయంలోకూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇద్దరు కేంద్రమంత్రులతో, ఎంపీలతో రాజీనామా చేయించి ఉంటే, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటూ డిఫెన్స్ లో పడిపోయిన బీజేపీ తలొగ్గిఉండేది. కానీ బాబు అలా చేసే సూచనలేమీ కనబడటంలేదు.

 

గోదావరి పుష్కరాల దుర్ఘటన

 

 

గోదావరి పుష్కరాల మొదటి రోజున జరిగిన తొక్కిసలాటలో దాదాపు 30 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు కారణం పూర్తిగా అధికార యంత్రాంగం వైఫల్యమే అన్నది చంద్రబాబు కూడా అంగీకరించారు. వాస్తవానికి ఆరునెలల ముందునుంచి ఈ పుష్కరాలకోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అనేకసార్లు రాజమండ్రి వెళ్ళి సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అయితే చివరికి తేలిందేమిటంటే ఆ సమావేశాల్లో క్రౌడ్ మేనేజిమెంట్ తప్పితే మిగిలినవన్నీ చర్చించారట.

What could be the rating of AP CM Chandrababu Naidu

 

150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు అంటూ విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి దీనినొక పెద్ద ఈవెంట్ గా జరపాలని చూడటంతో జనం ఆకర్షితులై మొదటిరోజే పోటెత్తారు. ముఖ్యమంత్రి వీఐపీలకు ఉద్దేశించిన ఘాట్ లో కాకుండా పుష్కర్ ఘాట్ లో కుటుంబసమేతంగా స్నానం చేస్తుంటే మంత్రులు, అధికారులందరూ అక్కడే నిలబడి వేడుక చూస్తున్నారు… ఇక్కడేమో తొక్కిసలాట ప్రారంభమై 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఎంతమంది జనం వస్తారనే అవగాహనగానీ, వచ్చిన భారీ జనాన్ని వేరే ఘాట్ లకు తరలించాలనే అలోచనగానీ లేకపోవటంతో ఘోరం జరిగిపోయింది.

 

ఓటుకు నోటు కేసు

 

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేము నరేందర్ రెడ్డి గెలుపుకోసం రేవంత్ రెడ్డి స్ఠీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టటానికి వెళ్ళి అడ్డంగా బుక్ అయ్యాడు. ఇలాంటి ఎన్నికల్లో ప్రతి పార్టీ ఇలాంటి పనులు చేయటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయిందన్నది ఎవరూ కాదనలేని నిజం. అయితే ప్రత్యర్థిపార్టీ అధికారంలో ఉన్న చోట, అడ్డగోలుగా, అమాయకత్వంగా వెళ్ళి బేరసారాలు చేయటం, అందునా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, ఇంత సీనియారిటీ, అనుభవం ఉన్న వ్యక్తి స్వయంగా దీనిలో కల్పించుకోవటాన్ని అజ్ఞానమని అనాలో, మూర్ఖత్వం అనాలో తెలియని పరిస్థితి. అయితే గుడ్డిలో మెల్లగా - తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించటం తీవ్రనేరం కిందకు వస్తుందని తేలటం ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు ఊరటనిచ్చిన విషయం. ఇరువర్గాలకూ అనుకూలుడైన ఒక పెద్దమనిషి దౌత్యంతో ఈ గొడవ మొత్తానికి చల్లబడింది. ఏది ఏమైనా ఏపీ ముఖ్యమంత్రి ఇలా అడ్డంగా బుక్ అవ్వటం రాష్ట్రప్రజలకే తలవంపులు తెచ్చిందనటంలో ఏమాత్రం సందేహంలేదు.

 

తుని ఘటన

 

కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలముందు పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం మొదలుపెట్టిన ఉద్యమం తునిలో తలపెట్టిన మహాసభతో పతాకస్థాయికి చేరింది. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గం దాదాపు పూర్తిగా ముద్రగడకు మద్దతుగా నిలబడింది. అటువంటి పరిస్థితిలో తుని మహాసభకు పెద్ద ఎత్తున జనం వస్తారని ఎవరైనా తేలిగ్గా ఊహించొచ్చు… అక్కడ సంఘవ్యతిరేక శక్తులు దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేయొచ్చు.

What could be the rating of AP CM Chandrababu Naidu

ప్రభుత్వం అలా అంచనా వేయకపోవటంతో అక్కడ బలగాలను తగిన సంఖ్యలో మోహరించలేదు. ఫలితంగా రైలు దహనం ఘటన… అల్లకల్లోలం చోటుచేసుకుంది. దీనిలో ఇంటలిజెన్స్ వైఫల్యం కూడా ఉంది. మరోవైపు ఈ ఘటనపై స్పందిస్తూ, ఇది స్థానికుల పనికాదని, గోదావరి జిల్లాలవారు ఇలాంటి పనులు చేయరని వ్యాఖ్యానించిన చంద్రబాబు, తదనంతర కాలంలో మాత్రం ఆ ఘటనకు సంబంధించి స్థానిక కాపునేతలపై కేసులు బుక్ చేయించారు.

 

కాపు ఓట్ బ్యాంకును కాలదన్నుకోవటం

 

2014 ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాలలో ఒకటి కాపు సామాజికవర్గం అన్న సంగతి తెలిసిందే. మరి అలాంటి ఓట్ బ్యాంకును స్వయంగా కాలదన్నుకోవటం ఏవిధమైన రాజనీతిజ్ఞతో అర్థంకాదు. కాపు సామాజికవర్గంలో ముద్రగడకు ఒక ప్రత్యేకస్థానం ఉంది…. నిష్కళంకమైన ఆయన ట్రాక్ రికార్డ్ వలన. ఆయన ఆందోళనకు  దిగాడని, దానిని చిలవలు పలవలుగా ఊహించుకుని, అదేదే ఖలిస్తాన్ ఉద్యమమో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమో అన్నంతగా భయపడి ముద్రగడను, ఆయన కుటుంబసభ్యులను నిర్బంధించి ప్రభుత్వం అనేకరకాలుగా వేధించింది. కిర్లంపూడిలో భారీ ఎత్తున బలగాలను మోహరించి మీడియాలో ముద్రగడ వార్తలు రాకుండా ఆంక్షలు విధించింది. తమ కులంలోని ముద్రగడలాంటి సాధుజీవిని అలా అవమానించటంతో ఆ సామాజికవర్గంలో టీడీపీపై సహజంగానే ఆగ్రహావేశాలు భగ్గుమన్నాయి. టీడీపీ మాట ఎత్తితేనే కాపులు కస్సుమంటున్నారు. ఈసారి పవన్ చెప్పినా టీడీపీకి ఓట్లు వేసేది లేదంటూ తెగేసి చెబుతున్నారు.

 

పార్టీ ఫిరాయింపులు

 

వైసీపీనుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగాయి. వీటిలో కొన్ని జగన్ వ్యవహారశైలి నచ్చక స్వచ్ఛందంగా జరిగినవికాగా, అధికభాగంమాత్రం అధికారపార్టీ ప్రలోభాలకు లొంగి జరిగినవి. తెలుగుదేశానికి శాసనసభలో పూర్తి మెజారిటీ ఉండగా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహించాల్సిన అవసరం వాస్తవానికి లేదు… అది కూడా పొరుగున ఉన్న తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ అక్రమంగా లాక్కుంటోంది అని యాగీ చేసిన నేపథ్యంలో. జగన్ ను దెబ్బకొట్టాలనో, ఏమో నైతిక విలువలకు, సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తీసుకున్నారు. కొందరికి మంత్రిపదవులు కూడా కట్టబెట్టారు. ఇలా తీసుకున్న ప్రజా ప్రతినిధుల నియోజకవర్గాల్లో రెండు పవర్ సెంటర్స్ ఏర్పడటంతో నంద్యాలలో, జమ్మలమడుగు వంటి పలుచోట్ల ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ దీని పర్యవసానాన్ని అనుభవించాల్సిఉంటుంది.

 

పరిపాలన

 

చంద్రబాబు 2004లో ఓడిపోవటానికి ప్రధానకారణాలలో ప్రభుత్వోద్యోగులను వెంటబడి వేధించటంకూడా ఒక కారణమన్నది తెలిసిందే. ఈ పొరపాటును తెలుసుకున్న ముఖ్యమంత్రి ఈ సారి అలా జరగకుండా చూసుకోవటం మంచి పరిణామమే. అయితే 2004నాటిరోజులకు పూర్తి విరుద్ధంగా, ఉద్యోగులపట్ల మొత్తానికి మెతకవైఖరి వహించటంకూడా సరైన పద్ధతి కాదు. 2014లో గద్దెనెక్కిన తొలినాళ్ళలోనే ఉద్యోగసంఘాల సమావేశాల్లో మాట్లాడుతూ, ఉద్యోగుల జోలికి తాను రానన్నట్లుగా బాబు సంకేతాలిచ్చారు. ఉద్యోగసంఘాలనేతలు ఏది చెబితే దానికి తలాడిస్తున్నారు. దానికి తోడు, ఉద్యోగసంఘాలనేతలకు భావి ముఖ్యమంత్రిగా ఎదగాలనుకుంటున్న చినబాబు అండ లభించిందనికూడా అంటున్నారు. దీని ప్రభావంతో పరిపాలనపై పట్టు పోయింది. క్షేత్రస్థాయిలో అవినీతి తీవ్రంగా పెరిగిపోయింది. ఎక్కడా పైసా లేనిదే పని జరగటంలేదు.

 

వీటన్నంటికంటే ముఖ్యంగా - ఓటుకు నోటు కేసు ఎఫెక్టుతో, సొంతగడ్డపైనుంచే పరిపాలన చేసుకుంటానంటూ బాబు హైదరాబాద్ వదిలి వచ్చేశారు… పదేళ్ళ కాలవ్యవధి ఉన్నాగానీ. దిల్ కుష్ గెస్ట్ హౌస్ కు, హైదరాబాద్ సెక్రటేరియట్ లో ఏపీ విభాగానికి కోట్ల రూపాయలతో చేసిన అలంకారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీని మరికొన్ని కోట్లతో నిర్మించారు… రెండేళ్ళ తర్వాత. ఆ పనేదో ముందే చేస్తే బాగుండేది కదా అన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు విభజన చట్టం ప్రకారం 9, 10 షెడ్యూల్ లోని 75 వేల కోట్ల విలువైన ఆస్తులను ఇరు రాష్ట్రాలకూ పంపకం చేయటంపై తాత్సారం జరుగుతున్నా బాబు ఆ విషయం పట్టించుకోకపోవటంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

తెలంగాణలో దుకాణం బంద్

 

2014 ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలినాళ్ళలో హైదరాబాద్ లో పార్టీ తెలంగాణ నేతల సమావేశంలో మాట్లాడుతూ, ఇక్కడకూడా అధికారంలోకి తీసుకొచ్చేవరకూ నిద్రపోనని చంద్రబాబు స్వయంగా చెప్పారు. వాస్తవానికి తెలంగాణలో ఎన్నికలపై బాబు పెద్దగా దృష్టి పెట్టకపోయినా, 15 స్థానాలు లభించాయి.  మొదటినుంచీ టీడీపీకి తెలంగాణలో మంచి పునాదులు ఉన్నాయి. అలాంటిది అధినేత పట్టించుకోకపోవటంతో కుప్పకూలిపోయింది. ఒక్కొక్కరుగా పార్టీనుంచి ఎమ్మెల్యేలు, నేతలు టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. చివరికి రేవంత్ కూడా జంప్ చేశారు. ఈ పాపం మొత్తం చంద్రబాబుదే. తెలంగాణలో పార్టీ పగ్గాలను లోకేష్ కు అప్పజెప్పి రోజువారీగా పర్యవేక్షింపజేస్తే ఇంత నష్టం జరిగేదికాదని, అయితే చినబాబు ఏపీలో మంత్రిపదవి చేపట్టటానికి ఉవ్విళ్ళూరుతుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తంమీద చూస్తే, నాడు 2011లో చిరంజీవి తన స్వార్థంకోసం ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారని విమర్శించిన చంద్రబాబు ఇవాళ అదే పనిచేయటం ఇక్కడ గమనార్హం.

                                                                                                                                         

                                                                                           

                                                                                         పోలవరం

 

పోలవరం ప్రాజెక్టును 2018కి పూర్తిచేసి దానిని చూపించి 2019లో ఓట్లు అడుగుదామని బాబు అనుకున్నారు. అయితే అదేమో రాయపాటి వారి ట్రాన్స్ ట్రాయ్ పుణ్యమా అని అది బాగా వెనకబడిపోయింది. ఎస్టిమేట్స్ బాగా పెరిగినప్పటికీ వాటిని పెంచాలని కేంద్రాన్ని అడిగే సాహసాన్ని బాబు ప్రభుత్వం చేయలేకపోతోంది. మరోవైపు బాబు పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై దృష్టిపెట్టటంకూడా పోలవరం ఆలస్యానికి కారణాలలో ఒకటని చెప్పొచ్చు. అయితే పట్టిసీమ పనుల్లో ఎన్ని అవకతవకలు ఉన్నప్పటికీ అంతిమంగా రైతులకు ఎంతో కొంత ప్రయోజనం చేకూరటం గుడ్డిలో మెల్లగా చెప్పుకోవాలి. గోదావరి నీళ్ళను పంపులద్వారా కృష్ణా కాలవలలోకి పంపి ఇదే నధుల అనుసంధానం అని, దేశంలోనే మొట్టమొదటిసారి తానే చేశానంటూ ప్రచారం చేసుకోవటంపై తీవ్రవిమర్శలు వ్యక్తమయ్యాయి.

 

మొత్తం మీద చూస్తే ఈ నాలుగేళ్ళలో చంద్రబాబు సమ్మిట్స్, ఈవెంట్స్ అంటూ తిరగటమే ఎక్కువ కనిపించిందిగానీ, తనదైన ముద్ర ఏమీ కనిపించలేదు. కనీసం నాటి జన్మభూమి, శ్రమదానం లాగా విజయవంతమైన కార్యక్రమాలలాంటివి ఏ ఒక్కదానిని కూడా ఈ ప్రభుత్వం ఈ సారి ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయింది. దీనంతటికీ కారణం టీడీపీకి గతంలోలా దిశానిర్దేశం చేసే మంచి థింక్ ట్యాంక్ లేకపోవటం, లోకేష్ కోటరీ ప్రభావం బలంగా ఉండటమేనన్న అభిప్రాయం బలంగా ప్రచారంలో ఉంది. మరోవైపు అసెంబ్లీలోకూడా వైసీపీని దీటుగా ఎదుర్కోలేకపోతోంది. వైసీపీలోని యువనాయకుల దాడిని ఎదుర్కోటానికి టీడీపీలో అచ్చెన్నాయుడు, బొండా ఉమ మాత్రమే ఉండటంతో వారు సరిపోవటంలేదు. వల్లభనేని వంశీ, ధూళిపాళ ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో వారు మౌనంగానే ఉంటున్నారు.  ఒక్కోసారి వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ చేసిన దాడికి చంద్రబాబు వెనక్కు తగ్గటం కొన్ని సెషన్స్ లో స్పష్టంగా కనిపించింది. కేసుల దృష్ట్యా జగన్ వల్నరబుల్ అయిఉన్నా, అతను కూడా పలు విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుని సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నా టీడీపీ దానినుంచి లబ్ది పొందలేకపోతోంది. ఒక ఉదాహరణ చూస్తే, జగన్ ప్రత్యేకహోదాకోసమంటూ 2015 అక్టోబర్ నెలలో గుంటూరుజిల్లాలో ఒక ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దానికి ప్రజలనుంచిగానీ, మీడియానుంచిగానీ పెద్దగా స్పందన రాకపోవటంతో దీక్ష తుస్సుమంది. ప్రభుత్వం ఎప్పుడు ఈ దీక్షను ఆపిస్తుందా అని వైసీపీ శ్రేణులు ఎదురుచూడటం ప్రారంభించాయి. చివరికి ఎలాగోలా ప్రభుత్వం దీక్షను భగ్నం చేయటంతో వైసీపీ వారు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అయితే టీడీపీవారు ఈ ప్రహసనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వివరించలేకపోయారు.

 

ఏది ఏమైనా కేసుల భయంతో గడగడ వణుకుతున్న ఈ రెండు ప్రధాన పార్టీలు మాత్రమే తమముందు ప్రత్యామ్నాయాలుగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్ణమని చెప్పాలి. పేరుకు జనసేన ఉన్నప్పటికీ, స్పష్టత, నిలకడ, assertiveness, ధృడసంకల్పం లేని ఆ సంశయాత్మక impulsive నాయకుడితో ఒరిగేదేమీ కనిపించటంలేదు. నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలను ఆ దేవుడే కాపాడాలి!

 

                                                                                         గత నాలుగేళ్ళలో చంద్రబాబు చేసిన విచిత్ర వ్యాఖ్యలు

 

నేనే సీనియర్ పొలిటీషియన్ - దేశం మొత్తంలోకీ తానే సీనియర్ రాజకీయవేత్తనని చంద్రబాబు ఆ మధ్య వ్యాఖ్యానించారు. పక్కనే తమిళనాడులో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన, 60 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న కరుణానిధి, ఇటుపక్క ఒరిస్సాలో 18 సంవత్సరాలనుంచి ముఖ్యమంత్రిగా ఉన్న నవీన్ పట్నాయక్, ఇంకా శరద్ పవార్, ములాయం వంటి కురువృద్ధులు ఎందరో ఉన్నా తాను సీనియర్ నని ఎలా అనుకుంటున్నారో బాబుకే తెలియాలి.

 

నీకూ ఏసీబీ ఉంది నాకూ ఏసీబీ ఉంది - ఓటుకు నోటు కేసు సందర్భంగా కేసీఆర్ ఒక సభలో చంద్రబాబునుద్దేశించి మాట్లాడుతూ, బిడ్డా నిన్ను జైలుకు పంపకుండా బ్రహ్మదేవుడుకూడా ఆపలేడు అన్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, నీకూ ఏసీబీ ఉంది, నాకూ ఏసీబీ ఉంది అని చంద్రబాబు అన్నారు. ఆయనలాంటి సీనియర్ పొలిటీషియన్, గొడవలు పడ్డప్పుడు చిన్నపిల్లలు చేసినట్లు చేసిన ఈ వ్యాఖ్యలు చూసి అందరూ నవ్వుకున్నారు.

 

నాకు ఉంగరం, వాచీకూడా లేదు, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు - 2016 ఫిబ్రవరిలో ఒక సందర్భంలో మాట్లాడుతూ, తన వంటిపై ఉంగరం, వాచీ కూడా ఉండవని, జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదని, తనలాంటి వాడిని పట్టుకుని వైసీపీవారు అన్యాయంగా మాటలంటున్నారని బాబు వాక్రుచ్చారు. దేశంలోకెల్లా ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న విషయం తెలిసిందే. అదీకాక రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నా బాబుగారు ఎక్కడకు వెళ్ళాలన్నా ఛార్టర్డ్ ఫ్లైట్ లోనే వెళుతున్న సంగతి కూడా విదితమే. ఈ మధ్య మాట మాట్లాడితే తాను నిప్పునని కూడా బాబు చెబుతున్నారు.

 

ఎస్.సి. కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు - కులాల రిజర్వేషన్లపై మాట్లాడుతూ ఎస్సీ కుటుంబంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారని బాబు కృష్ణాజిల్లాలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

 

మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయి - ఒక ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, మురికివాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే బాబుగారి అదృష్టంకొద్దీ, ఆ వ్యాఖ్యలను సాక్షి మీడియామాత్రమే రికార్డ్ చేసిఉండటంతో వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

 

భారతదేశంలోని నిర్మాణసంస్థలు మురికివాడలు మాత్రమే నిర్మిస్తాయి - అమరావతి నిర్మాణాన్ని స్విష్ ఛాలెంజ్ విధానంలో కేటాయించటంపై మాట్లాడుతూ, దేశంలోని కనస్ట్రక్షన్ సంస్థలపై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది దేశం పరువుతీయటమేనని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి.

 

(* రచయిత శ్రవణ్ బాబు సీనియర్ జర్నలిస్టు ఫోన్ 9948293346)