Asianet News TeluguAsianet News Telugu

Nagarjuna sagar : కృష్ణా జలాలపై వివాదం ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ, ఆంధ్రాల మధ్య కృష్ణాజలాల వివాదం ఎప్పటిది? కృష్ణా ట్రిబ్యునల్ ఏం చెబుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతం ఎంత? మొదట కృష్ణ నీళ్లు వాడుకోవాల్సింది ఎవరు? 

telangana election results : Why the dispute over Krishna waters now? - bsb
Author
First Published Dec 1, 2023, 1:04 PM IST

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిన తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరిగాయి. పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు నాగార్జున సాగర్ డ్యాం దగ్గర అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన 700మంది పోలీసులు డ్యాం మీదికి వచ్చారు. సాగర్ జలాల్లో తమ వాటా కోసం తెలంగాణ పోలీసులపై దాడికి దిగారు. వారి భూభాగంలో ఉన్న 13 గేట్లను ఆక్రమించుకున్నారు. ఆ తరువాత ఏపీ ఇరిగేషన్ అధికారులు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బుధవారం అర్థరాత్రిమొదలైన ఈ ఉద్రిక్తతలు శుక్రవారానికీ కొనసాగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో... నాగార్జున సాగర్ వివాదం చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ.. ఇప్పుడే హఠాత్తుగా ఇలాంటి చర్యలకు పాల్పడడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్ వస్తే వివాదాలు రెచ్చగొడతారని చెప్పడమా? అధికారుల స్థాయిలోనే ముగిసే వివాదాలు.. ముఖ్యమంత్రుల స్థాయికి ఎందుకు చేరుకున్నాయి? ఇదివరకు సాగర్ వివాదాలు ఏమున్నాయి? ఎన్నికల రోజు వివాదానికి తెరలేపడం వెనక ఏదైనా కుట్రకోణం ఉందా? ఇది ఎంతవరకు వెళ్లనుంది? ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నట్లుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అనిశ్చితి క్రియేట్ చేయడానికా? ఇలా పలు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో.. సాగర్ జలాలు, వాటి హద్దులు, హక్కులు, పంపిణీలపై కథనం.

ఈ అక్టోబర్ లో కేంద్ర మంత్రివర్గం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగర్ జలాల వివాదాన్ని పరిష్కరించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కృష్ణా వివాదం పరిష్కారానికి ట్రైబ్యునల్ 2 ద్వారా ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాలు ఏర్పాటు చేయడానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లలో కృష్ణా నీటిని పంపిణీ చేస్తూ కృష్ణా వాటర్ ట్రైబ్యునల్1 అవార్డు ఇచ్చింది. కానీ ఇప్పుడు మారిన పరిస్థితులకు అనుగుణంగా నీటి వాటాల కేటాయింపులో భాగంగా కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్2 ఏపీ, తెలంగాణల మధ్య వివాదాన్ని పరిష్కరిరించడానికి కొత్త విధి విధానాల ఖరారుకు నిర్ణయం తీసుకుంది.

Nagarjunasagar : తెలుగురాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ డ్యాం వివాదం... నివురుగప్పిన నిప్పులా పరిస్థితి

ఆ తరువాత అక్టోబర్ 19న ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం మీద ఏర్పాటైన బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి మేరకు ఇది జరిగింది. నవంబర్ 15లోపు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ మీద అభిప్రాయం చెప్పాలని ఏపీని కోరింది. కానీ ఏపీ మాత్రం విచారణ మొదలు కాగానే.. నోటిఫికేషన్ పై అధ్యయనం చేయడానికి సమయం కావాలని అడిగింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కానీ విచారణ నవంబర్ 22,23 తేదీలకు వాయిదా పడింది. కృష్ణా ట్రిబ్యునల్ 2కు విధివిధానాలు ఖరారు మీద ఏపీ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతతో ఉంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ తో సవాలు చేసింది. 

ఇదంతా జరుగుతుండగానే.. ఎన్నికల వేళ వివాదానికి పూనుకోవడంతోనే అసలు సమస్య అనేది విమర్శ. ఏపీ వాదనలు న్యాయం ఉండొచ్చు. తెలంగాణ వాదనలోనూ న్యాయం ఉండొచ్చు. కానీ.. రాష్ట్ర విభజన జరిగిన ఇన్నేళ్లలో లేని విధంగా ఈసారి ఎందుకు రెచ్చగొట్టారనేదే అందరి మనసుల్లోనూ మెదులుతోంది. 
 
అసలు కృష్ణానదీ వివాదం ఎందుకు వచ్చింది?

కృష్ణా నది దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్రలో పుట్టి అక్కడి నుంచి కర్ణాటక తెలంగాణ కు.. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఇంకా చెప్పాలంటే కృష్ణా నదికి ఓవైపు తెలంగాణ,  మరోవైపు  ఆంధ్ర ప్రదేశ్ లో ఉంటాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది. తెలంగాణలోని అలంపురం నుంచి ముక్త్రాల వరకు  కృష్ణా నది  రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఇక చివరగా పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రవహించి సముద్రంలో కలుస్తుంది కృష్ణానది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉమ్మడిగా ఉన్న సమయంలో… కర్ణాటక, మహారాష్ట్రలతో ఈ కృష్ణా జలాల పంపిణీ మీద వివాదాలు ఉండేవి.  ఆ సమయంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కృష్ణాజిల్లాలు అందడం లేవన్న వివాదం అంతర్గతంగా ఉండేది. ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా..  ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో  ఈ నీటి విషయంలో వివాదం ఉంది.

Nagarjuna Sagar Dam:ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై నాగార్జున సాగర్‌లో కేసు

 తెలంగాణ,  ఆంధ్రాలో కలిపి కృష్ణానది మీద శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు  ఉమ్మడిగా ఉన్నాయి.  వీటికి కూడా కొంత భాగం తెలంగాణలో,  కొంత భాగం ఆంధ్ర లో ఉన్నాయి, ఈ ప్రాజెక్టులను ఒకసారి పరిశీలిస్తే.. ఈ ప్రాజెక్టుల ఎగువ భాగంలో జూరాల ప్రాజెక్టు తెలంగాణలో ఉండగా..  దిగువ భాగంలో ఉన్న ప్రకాశం  బ్యారేజ్ ఆంధ్ర ప్రదేశ్ భూభాగంలో ఉంది. 

ఒక పాయింట్ విషయానికి వస్తే..  నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన వచ్చిన సమయంలో  మొదట నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇప్పుడున్న స్థలం కంటే 15 కీటో కిలోమీటర్ల ఎగువగా నిర్మించాలని  అనుకున్నారు.  కానీ అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణ,  మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయి  ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించడంతో.. కోస్తా ప్రాంతం వారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్థలాన్ని కాస్త ముందుకు జరిపించి తమకు లాభం జరిగేలా చేసుకున్నారనేది తెలంగాణ వైపు నుంచి వినిపిస్తున్న వాదన.

 ఇక తెలంగాణ నుంచి చేస్తున్న మరో ఆరోపణ ఏమిటంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ ఆంధ్ర,  ఎడమ కాలువ తెలంగాణకు  అనేది ఒప్పందం.  కానీ నిర్మాణం సమయంలో ఎడమ కాలువ కంటే కుడి కాలువ కాస్త తక్కువ ఎత్తులో నిర్మించడం వల్ల ఆంధ్రకు ఎక్కువ నీరు పోయేలా మార్చుకున్నారని వివాదం.

దీనికి ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆ సమయంలో ఉన్న పరిస్థితులు సాంకేతిక కారణాలే కానీ కావాలని చేసింది కాదనేది వాదిస్తుంది. ఏ ప్రాజెక్టులోను నీరు 365 రోజులు ఉండదు.  అలాగే నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తక్కువ నీరు ఉన్నప్పుడు ప్రాజెక్టు ఉన్న నల్గొండ ప్రాంతానికి నీరు ఆపేవారు.  కృష్ణ డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా పంపిణీ చేసేవారు అనేది.. వివక్షకు పాల్పడేవారు అనేది తెలంగాణ చేస్తున్న ఆరోపణ. 

అంతర్జాతీయ నది నియమాల్లోని సూత్రం ప్రకారం మొదటి నుంచి వాడుకుంటున్న వారికే ప్రాజెక్టులు మొదటి హక్కు ఉంటుంది దీన్నే ఫస్ట్ ఇన్ యూజ్ అంటారు.  అలా చూస్తే కృష్ణా నది మీద ప్రకాశం బ్యారేజ్ ను  బ్రిటిష్ కాలంలో కట్టారు.  దీని ప్రకారం ఈ నీటిని ముందుగా వాడుకునే హక్కు కృష్ణ డెల్టాకు ఉంది.  కఠిన ప్రాజెక్టులన్ని స్వతంత్రం వచ్చిన తర్వాతే.  అందుకే తమకే ఇందులో ఎక్కువ హక్కు ఉందని కృష్ణ డెల్టా రైతులు వాదిస్తారు.

ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత అన్నిసార్లు ఈ జలాల పంపిణీ విషయంలో  గొడవలు వచ్చాయి. చాలాసార్లు తీవ్రస్థాయికి వెళ్లినప్పటికీ ఇప్పుడు కనిపించిన స్థాయిలో ఎప్పుడు  దూకుడు లేదు. మాటల యుద్ధం జరిగేది…  అధికారుల  స్థాయిలో పరిష్కారాలు జరిగేవి.  ఇంకా చెప్పాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సామరస్య ఒప్పందాల మేరకు  నడిచిపోతున్నట్లుగా కనిపించేది.

 కానీ,  ఇప్పుడు సీన్ మారింది… తెలంగాణలో  పదెలుగా కొనసాగుతున్న ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడింది.  దీంతో  వచ్చే ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఉండడం కోసం..  ఈ వివాదాన్ని రెచ్చగొడుతున్నారనేది ప్రముఖంగా వినిపిస్తున్న వాదన.  ఇప్పటివరకు  ఇంత స్థాయిలో దూకుడు చూపించని ఆంధ్ర ప్రదేశ్… ఇప్పుడు ఎందుకు నాగార్జునసాగర్ డ్యాం పై ముళ్లకంచెలు వేసి,  13 గేట్లను స్వాధీనం చేసుకుంది?  కృష్ణా జలాల పంపిణీ  ట్రిబ్యునల్ అనుమతులు లేకుండా  ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు  2000 క్యూసెక్కుల నీటిని  ఎలా విడుదల చేసుకున్నారు?  రాష్ట్రంలో  రాబోయే  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  ఇరకాటంలో పెట్టి.. తెలంగాణ భవిష్యత్తును  గందరగోళంగా మార్చడానికేనా? ఏమో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. అప్పటికి కానీ విషయాలు తేలవు. 

Follow Us:
Download App:
  • android
  • ios