తూర్పు ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎన్సెఫాలిటిస్‌కు దూరంగా ఉందని... మరణాల సంఖ్య సున్నాకి తగ్గిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నాలుగో వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమిష్టి సంకల్పం, సమన్వయంతో కూడిన ప్రయత్నాల వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైందని సీఎం యోగి అన్నారు.

గతంలో ఎన్సెఫాలిటిస్ వల్ల ఏటా 1,200 నుంచి 1,500 మంది ప్రాణాలు కోల్పోయేవారని.. ఇలా ఈ ప్రాంతాన్ని దశాబ్దాలుగా పీడిస్తున్న మహమ్మారిని తరిమికొట్టామని అన్నారు., గోరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ మెడికల్ కాలేజీలోనే ప్రతి సంవత్సరం 700 మంది వరకు మరణాలు సంభవించేవారని సీఎం యోగి అన్నారు. 40 ఏళ్లలో ఈ వ్యాధి కారణంగా 50,000 మంది పిల్లలు విషాదకరంగా మరణించారని, గత ప్రభుత్వాలు ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆయన అన్నారు.

గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్ ఏర్పాటుకు మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఈ వ్యాధి నిర్మూలనలో ఎయిమ్స్ కీలక పాత్ర పోషించిందని ఆయన అన్నారు. 2017లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యాధిని నిర్మూలించాలని నిర్ణయించుకున్నామని... 2019 నాటికి ఈ ప్రాంతంలో కేసులు గణనీయంగా తగ్గాయని, ఈ ఏడాది ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆయన అన్నారు.

 ఇక ఉత్తరప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే దిశగా వేగంగా పురోగతి సాగుతోందని... ఇది ప్రధానమంత్రి మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉందని సీఎం యోగి తెలిపారు. 1,300 పడకల సామర్థ్యం గల డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ పురోగతిని ప్రస్తావిస్తూ, సమర్థవంతమైన నిర్వహణ, సమిష్టి కృషికి ఈ సంస్థ విజయం నిదర్శనమని సీఎం యోగి నొక్కి చెప్పారు. 5.11 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ గోల్డెన్ కార్డులను జారీ చేయడం, సీనియర్ సిటిజన్లకు కొత్త ప్రయోజనాలను అందించడంతో ఆరోగ్య రంగంలో ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉందని ఆయన అన్నారు.