న్యూఢిల్లీ: మణిపూర్ రాష్ట్రంలో సుమారు 60 రోజులుగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 120 మంది ఈ హింసాకాండలో బలయ్యారు. రాష్ట్రంలో హింస పెచ్చరిల్లి రెండు నెలలు దాటుతున్నా.. వాయిలెన్స్‌ను అదుపులోకి తీసుకురావడంలో సీఎం బీరెన్ సింగ్ విఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వమూ సకాలంలో కట్టడి చర్యలు తీసుకోలేకపోయింది. ఫలితంగా మణిపూర్ ఇంకా మండుతూనే ఉన్నది. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇందులో భాగంగానే ఆయన గవర్నర్ అనుసూయ యూకీ అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. ఈ రోజు ఆయన తన రాజీనామా పత్రాలను గవర్నర్‌కు అందిస్తారని రాష్ట్రమంతటా తెలిసిపోయింది. సీఎం రాజీనామాను ఆయన అభిమానులు, కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆయన రాజీనామాను అడ్డుకుంటామని పెద్ద పెట్టున ప్రజలు సీఎం నివాసానికి వచ్చారు. ఇంటి ముందుకు వచ్చి సీఎం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.

ఇంతలో సీఎం బీరెన్ సింగ్ బయటికి వచ్చారు. అక్కడ ఉన్న వారంతా ఆయనను రాజీనామా చేయవద్దని కోరారు. దీంతో ఆయన తిరిగి ఇంటిలోకి వెళ్లారు. ఆయన టీమ్ గేటులో నుంచి బయటకు వచ్చి సీఎం బీరెన్ సింగ్ రాజీనామా పత్రాన్ని చదివి అక్కడున్న వారికి వినిపించారు. 

ఇంతలో ఒకరు ఇద్దరు మహిళలను అక్కడికి తీసుకువచ్చారు. వారు ఆ రాజీనామా పత్రాన్ని ముక్కలుగా చించేశారు. 

Also Read: తమిళ రాజకీయాల్లో కలకలం.. సెంథిల్ బాలాజీ మంత్రిగానే వుంటారు : గవర్నర్‌కు స్టాలిన్ లేఖ

అనంతరం, సీఎం బీరెన్ సింగ్ తన నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పష్టత ఇచ్చారు. ఈ క్లిష్ట సమయంలో తాను తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు.

మణిపూర్‌లో గత నెల 3వ తేదీ హింస మొదలైంది. మైతేయి, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం బీరెన్ సింగ్ మైతేయీ కమ్యూనిటీకి చెందినవారు.

సీఎం బీరెన్ సింగ్.. కుకీ తెగపై విమర్శలు చేయడం, కుకీ సాయుధులే హింస చేస్తున్నారని ఏకపక్షంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.