భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే మెజారిటీ భారత ప్రజలకు చాలా దగ్గరయ్యారు. తన పదేళ్ల పాలనలో తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, అందించిన సుపరిపాలనతో ఆయన అత్యుత్తమ ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. దేశ, విదేశాల్లో ఆయన పరపతి భారీగా పెరిగింది. ఇలా 'విశ్వగురువు'గా గుర్తింపుపొందిన మోదీ తాజాగా తన గొప్పతనాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన చేసింది చాలా చిన్నపని... కానీ ఓ ప్రధాని అలా చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఇంతకూ ఏం జరిగిందంటే... భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 75 వసంతాలను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశ రాజధాని న్యూడిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. భారత న్యాయవ్యవస్థలో ఎంత కీలకపాత్ర పోషిస్తున్న సుప్రీంకోర్టు 75ఏళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో జ్ఞాపకార్థంగా రూ.75 వెండినాణెం, స్టాంప్ రూపొందించారు. వీటిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. 

ఇలా స్టాంప్, కాయిన్ ఆవిష్కరణ సమయంలో మోదీ వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. వీటిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి రిబ్బన్ చుట్టివుంచిన స్టాంప్ , కాయిన్ ను మోదీ చేతికి అందించారు. ఆ రిబ్బన్ ను తీసేసి ప్యాక్ ఓపెన్ చేసి వీటిని ఆవిష్కరించారు. ఈ సమయంలో రిబ్బన్ ను పక్కన పడేయకుండా తన జేబులో వేసుకున్నారు. మోదీ ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

స్వచ్చ భారత్ అంటూ ప్రజలను పరిశుభ్రత పాటించాలని చెప్పడమే కాదు స్వయంగా ప్రధాని మోదీ పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ఈ వీడియోను పోస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు బిజెపి నాయకులు. నెటిజన్లు కూడా మోదీ వ్యవహారించిన తీరును ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా మోదీ చేసిన పని మరోసారి స్వచ్చభారత్ కార్యక్రమాన్ని ప్రజలకు గుర్తుచేస్తోంది.