First suspected Mpox case in India:  ఇటీవల మంకీపాక్స్ (ఎంపాక్స్) వ్యాప్తి చెందుతున్న దేశం నుండి భారత్ కు వచ్చిన ఒక యువకుడిని ఎంపాక్స్ అనుమానిత కేసుగా గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. రోగిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఒంటరిగా ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది.

"ఎంపాక్స్ ఉనికిని నిర్ధారించడానికి రోగి నుండి నమూనాలను పరీక్షిస్తున్నారు. ఈ కేసును నిర్దేశించిన ప్రోటోకాల్‌లకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది" అని ప్రభుత్వ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటువంటి ఒంటరి ప్రయాణ మంకీపాక్స్  సంబంధిత కేసును ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సిద్ధంగా ఉందనీ, ఏదైనా సంభావ్య ప్రమాదాన్ని నిర్వహించడానికి, తగ్గించడానికి బలమైన వ్యవస్థలు ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మంకీపాక్స్ ఎందుకు ప్రమాదకరమైన వ్యాధి? 

కాగా, మంకీపాక్స్ (Monkeypox) ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది స్మాల్‌పాక్స్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంపై కురుపులు పెద్దవిగా ఏర్పడి తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ఈ వ్యాధి పాక్స్‌వైరిడే కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల సంభవిస్తుంది. 

మంకీపాక్స్ లక్షణాలు ఏమిటి?

మంకీపాక్స్ లక్షణాల్లో జ్వరం ఒకటి. సాధారణంగా 1-2 వారాలు పాటు జ్వరం క్రమంగా పెరుగుతుంది. మంకీపాక్స్ కారణంగా తీవ్రమైన తలనొప్పి కూడా ఉంటుంది. అలాగే, శరీర భాగాలలో నొప్పులు క్రమంగా పెరుగుతాయి. చర్మం పై చిన్న కురుపులు ఏర్పడి క్రమంగా అవి పెద్దవిగా పెరుగుతాయి. ప్రారంభంలో సాధారణంగా కనిపించి పసుపు రంగు నుంచి పసుపు బంగారు రంగులోకి మారుతాయి. అలాగే, అలసట, కళ్లు మండటం, శరీర నొప్పులు, ముక్కు కారటం కూడా వుండవచ్చు.

మంకీపాక్స్ ఎలా వ్యాపిస్తుంది? 

మంకీపాక్స్ ప్రధానంగా మధ్య-పశ్చిమ ఆఫ్రికాలో గుర్తించారు. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు వ్యాపించింది. అయితే, 2022 నుండి ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలను ప్రభావితం చేస్తోంది. అమెరికా, యూరప్ దేశాలు, కొన్ని ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ సాధారణంగా నేరుగా తాకడం వల్ల వ్యాపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో శ్వాస సంబంధిత గాలి ప్రవాహం ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. వ్యాధి ప్రాథమిక నివారణలో వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు వ్యాక్సినేషన్,ఇతర వైద్య చికిత్సలు అందిస్తారు.