01:45 AM (IST) May 30

మూడు రోజుల ఫైనల్‌కు సిసలైన ముగింపు

ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి మూడు రోజులు జరిగిన ఐపీఎల్-16 ఫైనల్  ను చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. మే 28న  మొదలు కావాల్సిన ఫైనల్ వర్షం కారణంగా రద్దైంది.  మే 29న  మ్యాచ్ ఆరంభమై ఒక ఇన్నింగ్స్ ముగిసినా.. చెన్నై బ్యాటింగ్ కు రాగానే   వర్షం పడింది.  దీంతో  సుమారు రెండు గంటల పాటు  మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత చెన్నై  టార్గెట్ ను 15 ఓవర్లలో 171 పరుగులు  చేయాల్సి ఉండగా.. చెన్నై  బ్యాటర్లు తమ నరాల్లో కరెంట్ తీగలు నింపుకుని వచ్చారో మరేమైనా తిని వచ్చారో గానీ రెచ్చిపోయి ఆడారు. చెన్నై బ్యాటర్లు విజృంభణతో  మే 30న ఫైనల్ ఘనంగా ముగిసింది. 

 

01:35 AM (IST) May 30

జడ్డూ మాయ.. చెన్నైకి ఐదో ఐపీఎల్ టైటిల్

ఆఖరి ఓవర్లో చెన్నై విజయానికి  13 పరుగులు అవసరం కాగా  హార్ధిక్ పాండ్యా.. మోహిత్ శర్మకు బంతినిచ్చాడు. ఫస్ట్  నాలుగు బంతుల్లో మూడు పరుగులే  వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరం కాగా ఐదో బంతికి జడ్డూ సిక్స్ కొట్టాడు.  ఆఖరి బంతికి  జడ్డూ బౌండరీ బాది  చెన్నైకి ఐదో టైటిల్ అందించాడు. 

01:28 AM (IST) May 30

14వ ఓవర్లో 8 పరుగులే..

షమీ వేసిన 14వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.  14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై.. 5 వికెట్ల నష్టానికి  158 పరుగులు చేసింది.  ఇక చివరి ఓవర్లో చెన్నై గెలవాలంటే.. ఆరు బంతుల్లో 13 పరుగులు కావాలి.  

01:20 AM (IST) May 30

6, 4, 6 బాది అవుట్ అయిన రాయుడు.. ధోని డకౌట్

కెరీర్ లో  చివరి  మ్యాచ్ ఆడుతున్న  అంబటి రాయుడు  చెన్నైని విజయానికి దగ్గర చేశాడు. మోహిత్ శర్మ వేసిన 13వ ఓవర్లో.. 6, 4, 6 కొట్టాడు.  కానీ ఇదే ఓవర్లో  నాలుగో బంతికి   రాయుడు..  మోహిత్ కే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. రాయుడు తర్వాత వచ్చిన ధోని (0) కూడా డకౌట్ అయ్యాడు. 13 ఓవర్లకు చెన్నై 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. చెన్నై విజయానికి 2 ఓవర్లలో 21 పరుగులు కావాలి. 

01:13 AM (IST) May 30

గేర్ మార్చిన దూబే..

రహానే  ఔటయ్యాక  చెన్నైని గెలిపించే బాధ్యతను శివమ్ దూబే తలకెత్తుకున్నాడు.  రషీద్ ఖాన్ వేసిన  12వ ఓవర్లో  ఆఖరి రెండు బంతులను దూబే  భారీ సిక్సర్లుగా మార్చాడు. దీంతో చెన్నై స్కోరు 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 133గా ఉంది.  ఆ జట్టు విజయానికి 3 ఓవర్లలో  38 పరుగులు రావాలి. 

01:08 AM (IST) May 30

మూడో వికెట్ కోల్పోయిన చెన్నై..

ఓపెనర్లు నిష్క్రమించిన తర్వాత  బాదే బాధ్యతను తలకెత్తుకున్న అజింక్యా రహానేను మోహిత్ శర్మ ఔట్ చేశాడు. మోహిత్ వేసిన  11వ ఓవర్లో  ఐదో బంతికి  రహానే.. విజయ్ శంకర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.   రహానే.. 13 బంతుల్లో   2 సిక్సర్లు, 2 బౌండరీల సాయంతో 27 పరుగులు చేశాడు.  11 ఓవర్లు ముగిసేటప్పటికీ చెన్నై.. 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. 

01:01 AM (IST) May 30

వంద దాటిన చెన్నై స్కోరు..

చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు వంద పరుగులు దాటింది.  రషీద్ ఖాన్ వేసిన పదో ఓవర్లో  13 పరుగులు వచ్చాయి.  ఇక చెన్నై విజయానికి  ఐదు ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉంది. రహానే (26 నాటౌట్), దూబే (11 నాటౌట్) ఆడుతున్నారు. 

12:58 AM (IST) May 30

9 ఓవర్లకు సీఎస్కే స్కోరు..

9 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్.. 2 వికెట్ల నష్టానికి  99 పరుగులు చేసింది. శివమ్ దూబే (4 నాటౌట్), రహానే (17 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  చెన్నై విజయానికి 6 ఓవర్లలో  72 పరుగులు  కావాలి. 

12:52 AM (IST) May 30

రహానే రెండు సిక్సర్లు..

జోషువా లిటిల్ వేసిన 8వ ఓవర్లో అజింక్యా రహానే  రెండు భారీ సిక్సర్లు బాదాడు. దీంతో చెన్నై స్కోరు 94కు చేరింది.  

12:47 AM (IST) May 30

డబుల్ షాకిచ్చిన నూర్ అహ్మద్.. రెండో వికెట్ కోల్పోయిన చెన్నై..

గుజరాత్ టైటాన్స్ స్పిన్నర్  నూర్ అహ్మద్ చెన్నైకి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు.  అతడు వేసిన 8వ ఓవర్లో మూడో బాల్ కు రుతురాజ్ ఔట్ కాగా ఆఖరి బంతికి  డెవాన్ కాన్వే (25 బంతుల్లో 47, 4 ఫోర్లు, 2 సిక్సర్లు)  కూడా నిష్క్రమించాడు.  ఏడు ఓవర్లు ముగిసేటప్పటికీ  చెన్నై స్కోరు.. 2 వికెట్ల నష్టానికి 78 పరుగులుగా ఉంది. 

12:42 AM (IST) May 30

చెన్నైకి బిగ్ షాక్.. గైక్వాడ్ ఔట్..

171 పరుగుల లక్ష్య ఛేదనలో  చెన్నై సూపర్ కింగ్స్ కు ఫస్ట్ షాక్ తాకింది. నూర్ అహ్మద్ వేసిన  ఏడో ఓవర్  మూడో బాల్ కు  గైక్వాడ్ భారీ షాట్ ఆడి రషీద్ ఖాన్  చేతికి చిక్కాడు.  గైక్వాడ్.. 16 బంతుల్లో 3 బౌండరీలు, 1 సిక్సర్  సాయంతో 26 పరుగులు చేశాడు. 

12:38 AM (IST) May 30

ఆరు ఓవర్లకు..

ఆరు ఓవర్లు ముగిసేటప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్.. వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. జోషువా లిటిల్ వేసిన ఆరో ఓవర్లో 14 పరుగులొచ్చాయి. డెవాన్ కాన్వే.. 22 బంతుల్లో 44 పరుగులు చేయగా రుతురాజ్ 14 బంతుల్లో 25 పరుగులతో ఆడుతున్నారు. చెన్నై విజయానికి 54 బంతుల్లో 99 పరుగులు కావాలి. 

12:28 AM (IST) May 30

ముగిసిన పవర్ ప్లే..

15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్..   దూకుడుగా ఆడుతోంది. ఓవర్ల కుదింపు వల్ల నాలుగు ఓవర్లకే కుదించిన  బ్యాటింగ్ పవర్ ప్లేలో  చెన్నై  ఓపెనర్లు దంచికొట్టారు.  4 ఓవర్లలోనే చెన్నై.. వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది.  ఇంకా ఆ జట్టు విజయానికి 66 బంతుల్లో 119 పరుగులు కావాలి. 

12:23 AM (IST) May 30

మూడు ఓవర్లకు 35

షమీ వేసిన 3 వ ఓవర్లో 11 పరుగులొచ్చాయి.  మూడు ఓవర్లు ముగిసేసరికి చెన్నై.. వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసింది. 

12:18 AM (IST) May 30

ధాటిగా మొదలెట్టిన చెన్నై..

వర్షం వల్ల  15 ఓవర్లలో 171 పరుగులుగా టార్గెట్ నిర్ణయించడంతో మ్యాచ్ ను మొదలుపెట్టిన చెన్నై.. ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. షమీ బౌలింగ్ లో గైక్వాడ్ బౌండరీ బాదగా.. హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో కాన్వే.. 6, 4 తో  మెరిశాడు. 2 ఓవర్లలో చెన్నై వికెట్ నష్టపోకుండా  24 పరుగులు చేసింది.  కాన్వే (12 నాటౌట్), రుతురాజ్ (11 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. 

 

11:46 PM (IST) May 29

క్రికెట్ అభిమానులకు ఇక జాగారమే..

10:45కు ఒకసారి  పిచ్ ను పరిశీలించిన అంపైర్లు.. 11:30 కి మరోసారి  పిచ్ ను తనిఖీ చేశారు. ఆన్ ఫీల్డ్ అంపైర్లు నితిన్ మీనన్, రాడ్ టక్కర్ లు మ్యాచ్ లో ఓవర్లను కుదించారు.  చెన్నై బ్యాటింగ్  చేసేది 15 ఓవర్లుగా నిర్ణయించారు.  దీని ప్రకారం.. చెన్నై 15 ఓవర్లలో 171 పరుగులను ఛేదించాల్సి ఉంటుంది.  కానీ మ్యాచ్  ప్రారంభయ్యేది 12:10 గంటలకు.. మరి మళ్లీ వర్షం పడితే  పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే సస్పెన్సే..! ఇక  ఈ 15 ఓవర్ల మ్యాచ్ లో 4 ఓవర్స్ పవర్ ప్లే, ఒక ఓవర్ కు మూడు ఓవర్ల  లిమిట్ మాత్రమే ఉండనుంది. 

 

11:05 PM (IST) May 29

ఇంకా తడిగానే గ్రౌండ్.. 11:30కు మరోసారి పరిశీలన

చెన్నై సూపర్ కింగ్స్  బ్యాటింగ్ కు వచ్చిన వెంటనే  వర్షం మళ్లీ  మొదలవడంతో ఆగిన ఆట ఇంకా  స్టార్ట్ కాలేదు. 10:45కు పిచ్ తనిఖీకి వచ్చిన అంపైర్లు అవుట్ ఫీల్డ్ ఇంకా తడిగా ఉండటంతో.. తిరిగి రాత్రి 11:30 కు మరోసారి    పిచ్ పరిశీలనకు వచ్చి నిర్ణయం తీసుకుంటారు.    అప్పటిదాకా  ఓవర్ల కుదింపు లేదు. 11:30 తర్వాత   కూడా వాన రిపీట్ అయితే అప్పుడు ఓవర్ల కుదింపు మొదలవుతుంది. 

 

10:41 PM (IST) May 29

10:45కు అంపైర్ల తనిఖీ..

వాన ఆగినా ప్రాక్టీస్ పిచ్, అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో గ్రౌండ్ సిబ్బంది దానిని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. 10:45 గంటలకు అంపైర్లు పిచ్‌ను తనిఖీ నిర్వహించి ఆ తర్వాత అప్డేట్స్ ఇవ్వనున్నారు. 

 

10:29 PM (IST) May 29

ఆగిన వాన.. గ్రౌండ్ ను సిద్ధం చేస్తున్న సిబ్బంది..

అహ్మదాబాద్ లో  చెన్నై బ్యాటింగ్ కు రాగానే   మూడు బంతులు పడ్డాక మొదలైన వాన.. కాస్త తెరిపినిచ్చింది. గ్రౌండ్ సిబ్బంది పిచ్ మీద కవర్లు తొలగించి అక్కడ   ఉన్న నీటిని తొలగిస్తున్నారు.  త్వరలోనే మ్యాచ్ మళ్లీ ఆరంభమయ్యే అవకాశాలున్నాయి. 

 

10:06 PM (IST) May 29

మరో 2 గంటల దాకా పుర్సత్..

అహ్మదాబాద్ లో చెన్నై - గుజరాత్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ - 16 ఫైనల్‌ను వరుణుడు మరోసారి ముంచెత్తుతున్నా ఈ మ్యాచ్  లో ఇప్పటికిప్పుడు ఓవర్లు కోల్పోయే  ప్రమాదమేమీ లేదు. మరో 2 గంటల తర్వాతే  ఓవర్ల కుదింపు మొదలవుతుంది. అదీగాక ప్రస్తుతం అహ్మదాబాద్ లో వరుణుడు కాస్త  శాంతించాడు.  వరుణుడు త్వరగా అహ్మదాబాద్ నుంచి వెళ్లిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.