Electric Two Wheeler: పేలుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
తమ ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగిన ఘటనపై ఓలా స్పందించింది. ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వివరించిచింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జనం చర్చ సాగుతున్న నేపథ్యంలో కంపెనీ కూడా అధికారిక ప్రకటన చేసింది. ఘటనపై విచారణ జరుగుతున్నట్లు తెలిపింది.
పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం తట్టుకోలేక ప్రజలు విద్యుత్ వాహనాలపై మొగ్గుచూపుతున్నారు. గత మూడేళ్ళుగా దేశంలో విద్యుత్ ద్విచక్రవాహనాల వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ప్రారంభదశలోనే ఉన్నా విద్యుత్ ద్విచక్రవాహనాల తయారీ, వినియోగం..రెవెన్యూ కోసమని పాక్షిక సాంకేతికతతో అభివృద్ధి చేసిన వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి సంస్థలు.
అయితే ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ప్రమాదాలు..విద్యుత్ ద్విచక్రవాహనాల మన్నిక, నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తమిళనాడులోని వేలూరు జిల్లాలో విద్యుత్ ద్విచక్ర వాహనం పేలి..ఇల్లు దగ్దమైన ఘటనలో ఇంటి యజమాని సహా ఒక బాలిక మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. మహారాష్ట్రలోని పూణేలోను ఒక విద్యుత్ ద్విచక్ర వాహనం ఉన్నట్టుండి అగ్నికి ఆహుతైంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈక్రమంలో విద్యుత్ ద్విచక్రవాహనాలు ఎంతవరకు సురక్షితం, ఎండా కాలంలో వాహనదారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొవాలి అనే విషయాలపై నిపుణులు పలు సూచనలు చేశారు. వాస్తవానికి సాధారణ పెట్రోల్ ద్విచక్ర వాహనాల వలె.. విద్యుత్ వాహనాలు సైతం ఎంతో సురక్షితమైనవే. వాహనం తయారీ సమయంలో వివిధ రకాల నాణ్యతా పరీక్షలు జరిపి, ఎటువంటి లోపాలు లేకపోతేనే అటువంటి వాహనాన్ని డీలర్లకు చేరవేస్తాయి తయారీ సంస్థలు. కొన్ని అనివార్య సమయాల్లో మాత్రమే విద్యుత్ వాహనాల్లో బ్యాటరీ, మోటార్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ వంటి విషయాల్లో తప్పిదాలు జరుగుతుంటాయని అటువంటి సమయంలో అక్కడ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
అయితే వాహనదారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో అటువంటి ప్రమాదాలు నివారించవచ్చని అంటున్నారు. ముందుగా వాహన వినియోగ సమయాన్ని బట్టి తరచూ చెకింగ్ చేయించాలి. బ్యాటరీ, మోటార్, ఇతర ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ సురక్షితంగా ఉన్నాయో లేదో గమనించాలి. విద్యుత్ వాహనాల్లో కీలకమైంది బ్యాటరీ. ఎండలో వాహనాన్ని పార్కింగ్ చేసినపుడు బ్యాటరీ వేడెక్కే ప్రమాదం ఉంటుంది. ఆసమయంలో వాహనదారులు కాస్త నీడ ఉన్న ప్రదేశంలో వాహనాన్ని పార్క్ చేసుకోవాలి.
వాహనంలో ఏదైనా సమస్య వచ్చి.. వాహనం స్టార్ అవ్వని పక్షంలో వ్యక్తిగత ప్రయోగాలు చేయకుండా వెంటనే మెకానిక్ లేదా, సర్వీస్ సిబ్బంది పర్యవేక్షణలో రిపేర్ చేయించడం మంచిది. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడంతో విద్యుత్ ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారినపడకుండా నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.