
అందమైన , మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ బిజీ లైఫ్ లో చర్మ సంరక్షణ కష్టంగా మారిపోయింది. దీనివల్ల చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం, వయసు మించిన వారిలా కనిపిస్తున్నారు. అలాంటి సమస్యలను కేవలం ఒకే ఒక్క పదార్థంతో పరిష్కరించవచ్చు. ఖరీదైన క్రీములు, సీరమ్స్ కొనాల్సిన పని లేదు. అది మరేంటో కాదు.. నారింజ తొక్కల పొడి.
ఆరెంజ్ తొక్క పొడి చర్మాన్ని బంగారంలా మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువ. దాని తొక్క పొడితో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఆరెంజ్ తొక్కతో ఏ ఫేస్ ప్యాక్స్ చేసుకోవచ్చో, వాటి లాభాలేంటో చూద్దాం.
1. తేనె, పసుపు, ఆరెంజ్ తొక్క పొడి ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి, తేనె, అర స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఫేస్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
2. ఆరెంజ్ తొక్క పొడి, పెరుగు ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి, రెండు స్పూన్ల పెరుగు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దుమ్ము, ధూళిని తొలగించి ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. రాత్రి పడుకునే ముందు వేసుకుంటే మెరుగైన ఫలితాదలు వస్తాయి.
3. ఆరెంజ్ తొక్క పొడి, రోజ్ వాటర్, ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్:
ఒక స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి, ఒక స్పూన్ ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ కలిపి ముఖం, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ముఖంలోని మురికిని తొలగిస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి మంచిది. వారానికి ఒకసారి వేసుకుంటే మీ ఫేస్ ప్రకాశవంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. యవ్వనంగా కూడా కనపడతారు.
4. ఆరెంజ్ తొక్క పొడి, చందనం, వాల్ నట్ ఫేస్ ప్యాక్:
పార్టీలకు వెళ్లేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది. ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి, చందనం పొడి, వాల్ నట్ పొడి కలిపి, కొద్దిగా నిమ్మరసం, రెండు స్పూన్ల రోజ్ వాటర్ కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. రోజంతా ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.
5. ఆరెంజ్ తొక్క పొడి, టీ ట్రీ ఆయిల్ ఫేస్ ప్యాక్:
మొటిమలు, మచ్చలు ఉన్నవారికి ఈ ఫేస్ ప్యాక్ మంచిది. ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి, రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్, ఒక స్పూన్ కలబంద గుజ్జు కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు వేసుకోవాలి.
6. ఆరెంజ్ తొక్క పొడి, తేనె, పంచదార, ఓట్స్ ఫేస్ ప్యాక్:
ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆరెంజ్ తొక్క పొడి, రెండు స్పూన్ల ఓట్స్ పొడి, అర స్పూన్ తేనె, ఒక స్పూన్ పంచదార, నీళ్లు కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ముఖంలో తేమను నిలుపుకుని, మంచి రంగునిస్తుంది.