ఓ సోషల్‌ మీడియా స్టార్‌ ఐపీఎస్ అయ్యిందంటే మాటలా: ఆష్ణా చౌదరి విజయగాథ ఇదిగో

By Naga Surya Phani Kumar  |  First Published Aug 27, 2024, 12:39 PM IST

'అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆగిపోవద్దు. తప్పులను సరిదిద్దుకుంటూ, కొత్త పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగితే విజయం వరిస్తుంది'. యువ ఐపీఎస్ అధికారి ఆష్ణా చౌదరి యూత్‌కు తరచూ ఇచ్చే సందేశం ఇది. సోషల్‌ మీడియాలో లక్షల ఫాలోవర్స్‌ను కలిగిన ఆష్ణా చౌదరి ఐపీఎస్‌ క్రాక్‌ చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా వేదికల్లో తన విజయ ప్రయాణం గురించి, ఐపీఎస్‌కు ప్రిపేర్‌ అయిన విధానం గురించి, ఐపీఎస్‌కు ఎలా సిద్ధం కావాలో తెలియజేస్తూ పాఠాలు కూడా చెబుతున్నారు. ఆమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రండి..


ఆష్ణా చౌదరి ఒక యువ ఐపీఎస్ అధికారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లా, పిఖువా పట్టణానికి చెందినవారు. ఆష్ణా తండ్రి డాక్టర్ అజిత్ చౌదరి ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె తల్లి ఇండు సింగ్ ఒక గృహిణి. చిన్నప్పటి నుంచి తండ్రి చదువు గొప్పతనాన్ని చెబుతూ పెంచారు. చక్కటి క్రమశిక్షణను ఆమెకు నేర్పారు. ఆమె తల్లి కూడా కష్టసుఖాలు తెలిసేలా పెంచారు. మధ్య తరగతి జీవితం అనుభవిస్తున్న ఆష్ణా చిన్నతనంలోనే ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నిర్ణయించుకున్నారు. 

* చదువు సాగిందిలా..
ఆష్ణా చౌదరి తన చదువంతా పిఖువా, ఉదయపూర్, ఢిల్లీలో పూర్తిచేశారు. పిల్ఖువాలో ప్రాథమిక విద్య, ఆ తర్వాత ఉదయపూర్‌లోని సెయింట్ మేరీ స్కూల్‌లో చదివింది. అనంతరం ఢిల్లీలోని డిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి చదివింది. అందులో 96.5% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. ఎనిమిది సార్క్ దేశాల సహకార ప్రాజెక్ట్ అయిన సౌత్ ఏషియన్ యూనివర్శిటీ నుండి ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో మాస్టర్స్ కూడా చేసింది. ఆమె చదువుతున్న సమయంలోనే వెనుకబడిన పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడే ఒక NGOతో పనిచేసింది.

Latest Videos

undefined

* UPSC ప్రయాణం..
ఆష్ణా తన యూపీఎస్సీ (సివిల్ సర్వీసెస్) ప్రయాణాన్ని 2022లో మూడవ ప్రయత్నంలో విజయవంతంగా పూర్తిచేసింది. మొదటి, రెండు ప్రయత్నాల్లో ఆమె ఫెయిల్‌ అయ్యింది. అయితే ఆమె వాటిని ఓటమిగా భావించలేదట. తాను ప్రిపేర్‌ అయ్యే విధానంలో లోపాలను తెలుసుకొని, వాటిని సరిదిద్దుకొని ఎగ్జామ్స్‌ రాసేదట. 2020, 2021ల్లో కేవలం రెండున్నర మార్కలు తేడాతో ప్రిలిమ్స్‌ మిస్‌ అయ్యింది. 2022లో మాత్రం పక్కాగా ప్రిపేరైంది. సిలబస్‌ను సవరించుకొని, మాక్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేస్తూ, సమాధానాలు మరింత మెరుగ్గా రాయడం ప్రాక్టీస్‌ చేసింది. తన వ్యక్తిత్వాన్ని పెంపొందించడంపైనా దృష్టి సారించింది. ఆమె తన బలహీనతలను అధిగమించి మూడో ప్రయత్నంలో దేశంలోనే 116వ ర్యాంకు సాధించింది. సుమారు 10 లక్షల మంది ఈ యూపీఎస్సీ పరీక్ష రాశారు.  వారందరిలో ఆమె 992 మార్కులు పొంది, తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకొంది. 

* ఇప్పటికీ సోషల్‌ మీడియా స్టార్‌..
ఆష్ణా చౌదరి ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే ఆమె ఓ స్టార్‌. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.61 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.  యూపీఎస్సీ క్రాక్‌ చేసిన తర్వాత ఇన్‌ప్లూయన్సర్‌గా మారి తన అనుభవాలనే పాఠాలు పంచుకుంటూ యువతను ప్రేరేపిస్తున్నారు.  


 

click me!