బెంగాల్ ఎన్నికలు: టీఎంసీ మహిళా నేతను వెంబడించి.. కర్రలు, ఇటుకలతో దాడి

By Siva KodatiFirst Published Apr 6, 2021, 5:43 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత మండల్‌పై కొందరు కర్రలు, ఇటుకలతో దాడికి దిగారు

పశ్చిమ బెంగాల్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజాత మండల్‌పై కొందరు కర్రలు, ఇటుకలతో దాడికి దిగారు.

పోలింగ్ బూత్ నుంచి ఆమెను కొంత దూరం వరకు వెంటబడి తరిమారు. దీంతో భయాందోళనలకు గురైన సుజాత పరుగు లంకించుకున్నారు. ఆరంబాఘ్‌లో టీఎంసీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు మధ్య వివాదం తలెత్తింది. ఇంతలోనే కొంత మంది గుంపు సుజాత మండల్‌పై కర్రలు, ఇటుకలతో దాడికి ప్రయత్నించారు.

ఈ విషయం తెలుసుకున్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడకి పాల్పడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేనని ఆమె ఆరోపించారు.

తమ పార్టీకి చెందిన మహిళా నేతను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఈ దాడికి పాల్పడ్డారని మమత ఎద్దేవా చేశారు. మరోవైపు ఆరంబాఘ్‌లో వివాదానికి కారణం కూడా బీజేపీయేనని దీదీ ఆరోపించారు.

సుజాత మండల్‌ తలపై గాయాలయ్యాయని టీఎంసీ తెలిపింది. ఆమెపై దాడికి సంబంధించిన వీడియోను తృణమూల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

click me!