తెల్లారితే పోలింగ్, ఈవీఎంతో బంధువుల ఇంటికి: ఎన్నికల అధికారి సస్పెన్షన్

By Siva KodatiFirst Published Apr 6, 2021, 3:56 PM IST
Highlights

ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తించే వారు అత్యంత అప్రమత్తంగా వుండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇంతటి బరువైన బాధ్యతను నెత్తిన వేసుకున్న ఓ వ్యక్తి చిన్న పొరపాటుతో ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈవీఎంతో సహా తన బంధువైన తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో నిద్రించి సస్పెన్షన్‌కు గురయ్యారు.  

వివరాల్లోకి వెళితే.. పశ్చిమ్ బెంగాల్‌లోని హౌరా జిల్లాలోని ఉలుబెరియా ఉత్తర్ నియోజకవర్గ పరిధిలో తపన్ సర్కార్.. సెక్టార్ అధికారిగా నియమితులయ్యారు. రాష్ట్రంలో మూడో దశ పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్న వేళ..ఆయన తన బంధువైన తృణమూల్ నేత ఇంట్లో రాత్రిపూట బస చేశారు.

అక్కడితో ఆగకుండా నిబంధనలకు విరుద్ధంగా తనతో పాటు రిజర్వ్ ఈవీఎంను కూడా బంధువు ఇంటికి తీసుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఎన్నికల కమీషన్ దృష్టికి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది ఆదేశాల ఉల్లంఘన కిందికి వస్తుందని.. ఆ సెక్టార్ అధికారిని సస్పెన్షన్ చేశామని, ఆయనపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోనున్నామని ఈసీ స్పష్టం చేసింది. అలాగే ఆయనతో అనుబంధంగా ఉన్న సెక్టార్ పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ రాత్రి అధికారి వెంట వున్న రిజర్వ్ ఈవీఎంకు చెందిన అన్ని సీళ్లను పరిశీలించి, వేరుగా ఉంచింది.

మరోవైపు ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈసీని డిమాండ్ చేశారు. పోలింగ్ రోజున ఇలా జరగడం..చాలా తీవ్రమైన విషయమన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మూడో దశలో 31 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది.

కాగా, కొద్దిరోజుల క్రితం అసోంలో ఓ బీజేపీ నేత వాహనంలో ఈవీఎం కనిపించడం తీవ్ర దుమారం రేపింది. నాటి ఘటనలో నలుగురు అధికారులపై వేటు వేసిన ఈసీ ఆ ప్రాంతంలో రీపోలింగ్‌కు ఆదేశించింది.  

click me!