63 ఫిర్యాదులు ఇచ్చాం.. మీరైనా చర్యలు తీసుకోండి: పోలింగ్ బూత్‌ నుంచి గవర్నర్‌కు దీదీ ఫోన్

By Siva KodatiFirst Published Apr 1, 2021, 6:50 PM IST
Highlights

నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన మమతా బెనర్జీ.. అక్కడి నుంచే నేరుగా రాష్ట్ర గవర్నర్‌కు ఫోన్‌ చేసి బీజేపీపై ఫిర్యాదు చేశారు.

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత పోలింగ్‌‌లో ఘర్షణలు, ఉద్రిక్తతలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. టీఎంసీ, బీజేపీ వర్గాల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నందిగ్రామ్‌లో సువేందు అధికారి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది.

ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ రెండు పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన మమతా బెనర్జీ.. అక్కడి నుంచే నేరుగా రాష్ట్ర గవర్నర్‌కు ఫోన్‌ చేసి బీజేపీపై ఫిర్యాదు చేశారు.   

పలు కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరుగుతోందని, బీజేపీ కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రాలను తమ అధీనంలోకి తీసుకుని ఓటు వేయకుండా ఓటర్లను అడ్డుకుంటున్నారని టీఎంసీ నేతలు ఆరోపించారు.

విషయాన్ని నందిగ్రామ్‌లోనే ఉన్న మమత దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ... స్థానిక బోయల్‌ ప్రాంతంలో గల 7వ నంబరు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. 

పోలింగ్‌ కేంద్రం నుంచే రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌కు ఫోన్‌ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి గూండాలు బెంగాల్‌కు వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారని దీదీ ఆరోపించారు. వారికి కేంద్ర బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని.. ఓటర్లను ఓట్లు వేయకుండా ఆ గూండాలు అడ్డుకుంటున్నారని మమతా బెనర్జీ గవర్నర్‌కు తెలిపారు.

తాము ఉదయం నుంచి ఎన్నికల కమిషన్‌కు 63 ఫిర్యాదులు చేశామని... కానీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.

కాగా, రెండో విడత పోలింగ్‌లో భాగంగా కీలకమైన నందిగ్రామ్‌తో పాటు 30 నియోజకవర్గాలకు గురువారం ఓటింగ్‌ జరిగింది. తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

click me!