వంశీ దెబ్బ: చంద్రబాబు కంటి మీద కునుకు లేకుండా చేసిన జగన్ వ్యూహం

By Nagaraju penumala  |  First Published Nov 1, 2019, 4:41 PM IST

 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ రాజకీయం అయితే చేసి జగన్ ను దెబ్బతీయాలని చూశారో అదే పరిస్థితి జగన్ తీసుకురాకపోయినప్పటికీ ఒక్క వంశీతోనే చుక్కలు చూపించారంటూ ప్రచారం జరుగుతుంది. 
 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రరాజకీయాలన్నీ ఈ వారం రోజులు టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చుట్టూనే తిరిగాయి. వల్లభనేని వంశీ మోహన్ నిర్ణయంపై రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా గమనించాయి. 

గత వారం అంతా వల్లభనేని వంశీ రాజీనామాపైనే చర్చ జరిగితే వైసీపీలో చేరతారా...చేరితే చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఏంటి...జగన్ పెట్టే కండీషన్స్ ఏంటి అసలు వంశీ దారెటు అనే అంశాలపైనే ఈ వారం రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. 

Latest Videos

వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశంపైనే చర్చ జరిగింది. వల్లభనేని వంశీ బాటలోనే మరికొందరు ఎమ్మెల్యే పయనిస్తారని ప్రచారం జరగడంతో వంశీ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే చర్చ జరిగింది. 

ఒకవేళ వల్లభనేని వంశీమోహన్ వైసీపీలో చేరితే సీఎం జగన్ ఎలాంటి కండీషన్లు పెడతారు, గన్నవరం నియోజకవర్గంలో అనుసరించే వ్యూహం ఏంటి అనే అంశంపై పొలిటికల్ సర్కిల్ లో రసవత్తర చర్చ జరిగింది.  

వంశీమోహన్ రాజీనామాతో తెలుగుదేశం పార్టీలో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వైసీపీలో చేర్చుకోబోమని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో ఊపిరిపీల్చుకున్న చంద్రబాబు జగన్ తాజా వ్యూహంతో చిక్కుల్లో పడ్డారు. 

టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరితే తమ సభ్యుల సంఖ్య తగ్గితే తనకు ప్రతిపక్ష హోదా పోతుందనే టెన్షన్ లో పడ్డారు చంద్రబాబు నాయుడు.  

మెుదట వంశీని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు. తాను అండగా ఉంటానని కేసులకు భయపడవద్దని భరోసా ఇచ్చినప్పటికీ వంశీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. 

దాంతో దూతను పంపించారు చంద్రబాబు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను వంశీ వద్దకు పంపించి పార్టీలో ఉండేలా ఒత్తిడి తెచ్చే  ప్రయత్నం చేసినప్పటికీ అవి ఫలించలేదు. బుజ్జగింపులు బెడిసికొట్టడంతో దూతలుగా వెళ్లిన ఎంపీ నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు నిట్టూర్చాల్సి వచ్చింది. 

వంశీ వైసీపీలో చేరే అంశం కన్ఫమ్ కావడంతో చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. వంశీతోనే మెుదలై వంశీతోనే ఈ వలసల ప్రక్రియ ఆగిపోవాలని నిర్థారించుకున్నారు. అసంతృప్తిగా ఉన్న నేతల జాబితాను తయారు చేశారు. 

వారితో బుజ్జగింపుల పర్వానికి దిగారు చంద్రబాబు అండ్ టీం. వైయస్ జగన్ 151 సీట్లతో అఖండ విజయాన్ని సాధించి అధికారంలోకి రావడంతో టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై చర్చ మెుదలుపెట్టారు.  

రాయలసీమ ప్రాంతంతోపాటు ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించడంతో చంద్రబాబు అప్రమత్తమై వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఖచ్చితంగా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రస్తుతానికి అసెంబ్లీలో టీడీపీకి 23 మంది సభ్యులు ఉన్నారు. వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ సంఖ్య కాస్త 22కు పడిపోయింది. 
  
మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గనుక పార్టీకి గుడ్ బై చెప్తే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోతుంది టీడీపీ. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరా తీసినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు ఎవరూ వైసీపీలో చేరకుండా ఉండేందుకు వ్యూహాన్ని రచించారు చంద్రబాబు. 

నియోజకవర్గాల వారీగా సమీక్షలు అంటూ మరోవైపు ఇసుక కొరతపై పోరాటం అంటూ రాజకీయాల్లో టాపిక్ డైవర్ట్ చేశారు. దాంతో వలసల అంశం కాస్త మరుగున పడిపోయే పరిస్థితి వచ్చింది. మెుత్తానికి వల్లభనేని వంశీ ఎపిసోడ్ చంద్రబాబు నాయుడుకు కంటిమీద కునుకులేకుండా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇకపోతే ప్రస్తుతానికి వంశీ మినహా మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నప్పటికీ భవిష్యత్ లో చంద్రబాబుకు వారి నుంచి ముప్పు పొంచే ఉందని తెలుస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పదవి పోతుంది. ఇప్పటికే వైసీపీలో చేరేందుకు నలుగురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట.

ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్ లో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై పొలిటికల్ పంచ్ లు పడ్డాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏ రాజకీయం అయితే చేసి జగన్ ను దెబ్బతీయాలని చూశారో అదే పరిస్థితి జగన్ తీసుకురాకపోయినప్పటికీ ఒక్క వంశీతోనే చుక్కలు చూపించారంటూ ప్రచారం జరుగుతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

పొత్తు పొడుపు: ఇసుక సాక్షిగా పవన్ కల్యాణ్ తో చంద్రబాబు దోస్తీ

ఇసుక చుట్టే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయాలు

వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ : వంశీ బాటలోనే మరో టీడీపీ ఎమ్మెల్యే

వల్లభనేని వంశీ మారినా క్యాడర్ చంద్రబాబు వెంటే

ఏటూ తేల్చుకోలేని స్థితిలో వల్లభనేని వంశీ: కేశినేని నాని

click me!