చంద్రబాబు వ్యూహానికి దెబ్బ: హుజూర్ నగర్ లో కూకట్ పల్లి రిపీట్

By telugu team  |  First Published Oct 27, 2019, 5:16 PM IST

హుజూర్ నగర్ లో కూకట్ పల్లి రిపీట్ అయింది. ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు సుహాసినిని నిలబెట్టి కూకట్ పల్లిలో విజయం సాధించాలని చంద్రబాబు భావించారు. హుజూర్ నగర్ లో చావా కిరణ్మయి ద్వారా బలం చాటాలని చూశారు.


హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి సంబంధించి హుజూర్ నగర్ లో కూకట్ పల్లి రిపీట్ అయింది. హుజూర్ నగర్ లో తమ అభ్యర్థిని నిలబెట్టి తమ బలాన్ని తిరిగి పొందాలని చేసిన ప్రయత్నంపై చావు దెబ్బ పడింది. హుజూర్ నగర్ లో కూడా కూకట్ పల్లిలో మాదిరిగానే పెద్ద యెత్తున సీమాంధ్రులు, కమ్మ సామాజిక వర్గం ప్రజలు ఉన్నారు. దాన్ని పునాదిని చేసుకుని తమ బలాన్ని నిరూపించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావించారు. 

తెలుగుదేశం పార్టీ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని 17 సీట్లకు పోటీ చేసింది. అయితే రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఆ సమయంలో కూకట్ పల్లిలో తాము తప్పకుండా గెలుస్తామని టీడీపీ నాయకులు భావించారు. కూకట్ పల్లిలో ఆంధ్ర సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆ సీటును గెలుచుకోవడానికి ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కూతురు సుహాసినిని రంగంలోకి దింపారు. 

Latest Videos

Also ReadL Weekend political review: కేసీఆర్ కు ఆర్టీసీ సెగ, హుజూర్ నగర్ ఊరట

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నందమూరి హీరో బాలకృష్ణ కూకట్ పల్లిలో పెద్ద యెత్తున ప్రచారం నిర్వహించారు. కానీ ఫలితం దక్కలేదు. ఆ సీటును టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుచుకున్నారు. దాంతో లోకసభ ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ చేయలేదు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉంది. 

అయితే, ఆశ్చర్యకరంగా టీడీపీ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలోని 50 వేల మంది ఆంధ్ర సెటిలర్ల ఓట్లను, 11 వేల మంది కమ్మ సామాజిక వర్గం ఓటర్లను దృష్టిలో పెట్టుకుని పోటీకి దిగింది. అది కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చావా కిరణ్మయిని అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఆ రెండు వర్గాల నుంచి తమకు తగినన్ని ఓట్లు వస్తాయని టీడీపీ నాయకులు భావించారు. అయితే, చావా కిరణ్మయికి కేవలం 1,827 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ఆమె డిపాజిట్ కూడా కోల్పోయారు. 

హుజూర్ నగర్ లో భారీ ఓట్లను సాధించడం ద్వారా తెలంగాణలోని క్యాడర్ లో విశ్వాసం పాదుకొలి తెలంగాణలో పార్టీని పునరుద్ధరించవచ్చునని చంద్రబాబు భావించారు. కానీ, దానిపై హుజూర్ నగర్ ఫలితం తిరుగులేని దెబ్బ వేసింది. తద్వారా తెలంగాణలో పార్టీ తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని అర్థమవుతోంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా తెలంగాణలో బలంగా ఉండేది. బీసీలు తెలుగుదేశం వెనక తిరుగులేని శక్తిగా నిలుస్తూ వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పై దృష్టి పెట్టి తెలంగాణను విస్మరించారు. టీడీపీ నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరుతూ వచ్చారు. దాంతో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనే మాట వినిపిస్తోంది. 

click me!