చంద్రబాబుకు భారీ షాక్: జగన్ షరతులకు బ్రేక్, టీడీపీ ఎమ్మెల్యేల ప్లాన్

By telugu team  |  First Published Oct 27, 2019, 4:46 PM IST

టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భారీ షాక్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్ జగన్ అనర్హత వేటు ప్రమాదాన్ని కూడా తప్పించుకోవడానికి టీడీఎల్పీని నిలువునా చీల్చి అసెంబ్లీలో ప్రత్యేకమై గ్రూపుగా గుర్తింపు పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ఆయన తన నిర్ణయాన్ని ఆదివారం అమలులో పెట్టారు. 

టీడీపీ, వైసీపీ నేతలను పార్టీలోకి తీసుకుని వచ్చే బాధ్యతను బిజెపి నాయకత్వం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి అప్పగించింది. దాంతో ఆయన టీడీపీ నేతలను కలవడం ప్రారంభించారు. ఆయనతో టీజీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం భేటీ అయ్యారు. అయితే, మంత్రులు కోడాలి నాని, పేర్ని నాని కలిసి వంశీని జగన్ వద్దకు తీసుకుని వెళ్లారు. 

Latest Videos

Also Read: టీడీపీకి వల్లభనేని వంశీ రాజీనామా: రాజకీయాలకు గుడ్‌బై

వంశీకి జిల్లా అధ్యక్ష పదవిని, ఎమ్మెల్సీ పదవిని వైఎస్ జగన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. తర్వాతి కాలంలో ఆయన వైసీపీ గూటికి చేరవచ్చు. ఆయన ప్రత్యర్థి యార్లగడ్డ వెంకటరావు నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదరువుతోంది. ఈ స్థితిలో యార్లగడ్డ వెంకటరావుకు జగన్ భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం సద్దుమణిగే వరకు వంశీ రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. 

ఆ విషయాన్ని అలా ఉంచితే, చంద్రబాబుకు మాత్రం భారీ ముప్పు తప్పదని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం (టీడీఎల్పీ) నిలువునా చీలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమ పార్టీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి రావాలని వైఎస్ జగన్ టీడీపీ ఎమ్మెల్యేలకు షరతు పెట్టారు. అలా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు వేయాలని ఆయన స్పీకర్ సీతారాంకు సూచించారు. తద్వారా టీడీపీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరకుండా అడ్డుకట్ట వేయగలిగారు. 

Also Read: చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు ఎసరు: జగన్ కి టచ్ లో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలు.

దాదాపు పది మంది తెలుగుదేశం నాయకులు పార్టీ మారాలని చూస్తున్నట్లు సమాచారం. వారిలో నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ పెట్టిన షరతును అధిగమించడానికే కాకుండా అనర్హత వేటు పడకుండా చూసుకోవడానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా టీడీఎల్పీని చీల్చి ప్రత్యేకమైన గ్రూపుగా శాసనసభలో గుర్తింపు పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

మరో నాలుగున్నర ఏళ్ల పాటు తమ నాయకులను, క్యాడర్ ను కాపాడుకోవడం ప్రస్తుత స్థితిలో చంద్రబాబుకు కనాకష్టంగా ఉంది. వారిని కాపాడుకోవడానికి చంద్రబాబు బిజెపికి దగ్గర కావాలని చూస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, చంద్రబాబు వ్యూహానికి బిజెపి రాష్ట్ర నేతలు కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబుకు బిజెపి తలుపులు మూసుకున్నాయని, ఆయన కోసం తలుపులు తెరిచే ప్రసక్తి లేదని చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు పార్టీలో కొనసాగడం అంత సులభం కాదని అంటున్నారు.  

click me!