తెలంగాణ 2020-21 వార్షిక బడ్జెట్ లో గ్రామీణాభివృద్ది కోసం భారీగా నిధులు కేటాయించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: 2020 బడ్జెట్ సమగ్ర సంక్షేమ, అభివృద్ధి కాముకంగా ఉన్నదని... తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఆర్తి, కడుపునిండా ప్రేమ ఉన్న సీఎం కెసిఆర్ ముందు చూపునకు నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బంగారు తెలంగాణకు బాసటగా ఈ బడ్జెట్ ఉందని ఆయన చెప్పారు. అలాగే తాను నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాశాఖలకు సముచిత రీతిలో నిధులు కేటాయించారని సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిధులు కేటాయించినందుకు సిఎం కెసిఆర్, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుకి ఎర్రబెల్లి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి దయాకర్ రావు సిఎం కెసిఆర్ ని అసెంబ్లీలోని ఆయన కార్యాలయంలో స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళి కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ బడ్జెట్ 2020... కేసీఆర్ ఆశిస్సులు తీసుకుని బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ (ఫోటోలు)
2020 బడ్జెట్ పై మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... పటిష్టమైన పంచాయతీరాజ్ చట్టం తేవడం ద్వారా గ్రామాల అభివృద్ధి కీలకంగా మారిందని, ప్రజాప్రతినిధులు, అధికారులకు జవాబుదారీ తనం పెరిగిందని అన్నారు. సమగ్ర గ్రామీణ విధానం అమలు అవడం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి తద్వారా గ్రామాల ముఖ చిత్రాలను మార్చే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల వివాదాలను పరిష్కరించడం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసిందని అన్నారు.
అలాగే పల్లెల ప్రగతి కోసం చేపట్టిన పల్లె ప్రగతి -30 రోజుల ప్రణాళిక కార్యక్రమం దేశంలోనే వినూత్నమన్నారు. అలాంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరూ చేపట్టలేదని, సిఎం కెసిఆర్ ఆలోచనల్లోంచి వచ్చిన ఈ పథకం వల్ల పల్లెల్లో పచ్చదనం-పరిశుభ్రత నెలకొందన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా పాలుపంచుకునే ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ఓ నర్సరీ, ఒక స్మశానం, డంప్ యార్డులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి, ఆ తర్వాత చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలను విప్లవాత్మక కార్యక్రమాలని మంత్రి ఎర్రబెల్లి అభివర్ణించారు.
గ్రామాల అభివృద్ధికి ఆర్థిక సంఘం నిధులతో పాటు దానికి సమానంగా అంతే మొత్తాన్ని కలిపి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు అందిస్తుందని మంత్రి చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల్లో వస్తు సామగ్రి వ్యయం కోసం ప్రతి నెలా 65 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తుంది. 600 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామాల్లో ప్రభుత్వం సిసి రోడ్ల నిర్మాణం చేపట్టింది. పంచాయతీల్లో 36 వేల మంది పారిశుధ్య కర్మచారుల వేతనాలకు 8500/- రూపాయలకు పెంచింది. గ్రామ పంచాయతీల్లో పని చేసే సిబ్బందికి 2 లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇక పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కోసం ఈ బడ్జెట్ లో రూ. 23,005 కోట్లు ప్రతిపాదించడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
read more స్వంత స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: హరీష్ రావు
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన మంచినీటి వ్యవస్థని సిఎం గారు గాడిలో పెట్టారు. మిషన్ భగీరథ పథకం ద్వారా సిఎం కెసిఆ్ అపర భగీరథుడిగా మారి, ఇంటింటికీ నల్లాలతో స్వచ్ఛమైన భూ ఉపరితల మంచినీటిని అందిస్తున్నారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన భగీరథ పథకాన్ని కేంద్రం కూడా అమలు చేయాలని చూస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్లలో ఏ ఒక్కరూ ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడలేదు అని ఇండియన్ నేచురల్ రీసోర్సెస్ ఎకనమిక్ అండ్ మేనేజ్మెంట్ ఫౌండేషన్ ఇటీవల ప్రకటించింది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన ద్వారా దక్కిన సార్థకతకు ఒక నిదర్శనమని ఘంటా పథంగా చెబుతున్నానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.