స్థానికసంస్థల ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేనలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీలకు చెందిన మాజీ మంత్రి, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వైసిపి కండువా కప్పుకున్నారు.
విశాఖపట్నం: స్థానికసంస్థల ఎన్నికలకు ముందు తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఎదురుదెబ్బలు తప్పడంలేదు. విశాఖపట్నంలో జిల్లాలో ఈ రెండు పార్టీలకు ఒకేసారి షాకిచ్చారు ఎంపీ విజయసాయి రెడ్డి. మంగళవారం ఆయన సమక్షంలో మాజీ మంత్రి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, చింతలపూడి వెంకటరామయ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు విశాఖకు చెందిన పలువురు నాయకులు కూడా అధికార పార్టీలో చేరి ప్రతిపక్ష పార్టీలకు షాకిచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు పసుపులేటి బాలరాజు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆయన కాంగ్రెస్ ను వీడి జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దీంతో ఆ తర్వాత పార్టీకి కాస్త దూరంగా వుంటూ వస్తున్న ఆయన తాజాగా విజయసాయి రెడ్డి సమక్షంలో వైసిపి కండువా కప్పుకున్నారు. బాలరాజుతో పాటు ఆయన అనుచరులు, పలువురు నేతలు వైసిపిలో చేరారు.
undefined
read more జాతీయ జెండా దిమ్మెకు వైసిపి రంగులు... బొత్సకు చెంపపెట్టు...: అనురాధ ఫైర్
ఇదే విశాఖ జిల్లాకు చెందిన మరో జనసేన నాయకుడు కూడా వైసిపిలో చేరారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య గతంలోనే జనసేనకు రాజీనామా చేయగా తాజాగా విజయసాయి రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
విశాఖ ఉత్తరం మాజీ శాసనసభ్యుడు తైనాల విజయ్ కుమార్ కూడా తిరిగి వైసిపిలో చేరారు. గతంలో విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీగా పనిచేసిన ఆయన సరిగ్గా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు నాలుగు రోజుల ముందు పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు మద్దతుగానే విజయ్ కుమార్ వైసిపిని వీడినట్లు ప్రచారం జరిగింది. తాజాగా అతడు మళ్లీ సొంతగూటికే చేరుకున్నారు.
read more సంతలో పశువుల్లా టిడిపి నాయకుల కొనుగోలు... దమ్ముంటే అలా చేయ్: జగన్ కు బుద్దా సవాల్