వైసిపి కుట్రలు... చంద్రబాబు వాహనంపై దాడికి ముందే ప్రణాళిక..: సోమిరెడ్డి

By Arun Kumar PFirst Published Nov 29, 2019, 4:08 PM IST
Highlights

రాజధాని అమరావతి పర్యటనలో రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి రక్షణ కల్పించడంలో జగన్ ప్రభుత్వం విఫలమయ్యిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  

నెల్లూరులో:  రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు తప్ప మిగతా ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనలో దాడులు చేస్తామని వైసీపీ నాయకులు ముందే ప్రకటించినప్పటికీ పోలీసులు వారిని అదుపు చేయలేకపోయారని... ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని సోమిరెడ్డి ప్రశ్నించారు. 

చంద్రబాబు అమరావతి పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేకపోయిందన్నారు. గందరగోళం సృష్టించినవారిని పోలీసులు అదుపు చేయలేకపోగా రాళ్లు, లాఠీలు, చెప్పులతో కాన్వాయ్ పై దాడి చేస్తే నష్టపోయిన వారు చేశారని... వారికి ఆ హక్కు ఉందని డీజీపీ వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముందుగా చెప్పిమరీ రాళ్లు, చెప్పులతో దాడులు చేయవచ్చని... ఎవ్వరిని ఆపవవద్దని రాష్ట్రంలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలకు డీజీపీ ఆదేశాలివ్వాలి.  అప్పుడు అందరికీ స్వాతంత్ర్యం వస్తుంది కదా అని నిలదీశారు. 

read more  శబరిమల యాత్రలో విషాదం...విజయనగరం వాసి మృతి, 15మందికి గాయాలు

మాజీ సీఎం కాన్వాయ్ పై దాడి చేసిన వారిని సాయంత్రానికి బెయిలిచ్చి వదిలేశారన్నారు. ఆయనకు రక్షణ లేకుంటే ఇక సామాన్యుడికి రక్షణ ఎవరు కల్పిస్తారని  పోలీస్ బాస్ ను ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వం వచ్చాక 13 జిల్లాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయి నిర్మాణ రంగం  పూర్తిగా దెబ్బతిందని గుర్తుచేశారు. ఇలా నష్టపోయిన వారంతా ఎవరిపై దాడి చేయాలని అడిగారు. 

అమరావతిలో రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు నష్టపోవడానికి కారణమెవరో అందరికీ తెలుసన్నారు. తమకు న్యాయం చేయాలని అహర్నిశలు కష్టించిన చంద్రబాబుపై దాడులు చేసేంత దుర్మార్గానికి రైతులు ఒడిగట్టరని... ఈ పని ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలకు అర్థమయిపోయిందన్నారు.  

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉందని కానీ రాళ్లు, చెప్పులు వేసి కాదని అన్నారు. రాజధాని ప్రాంతాన్ని చంద్రబాబు  అభివృద్ధి చేసి అక్కడి వారి ఆస్తుల విలువ పెంచారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే రాజధాని ప్రాంతంలో ఆస్తుల విలువల అమాంతంగా పడిపోయిందన్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడుపై అమరావతి వాసులెలా దాడి చేస్తారని అన్నారు. 

read more  రైతులు కాదు... చంద్రబాబుపై దాడిచేసింది పోలీసులే..: అచ్చెంనాయుడు

గతంలో నేదురుమల్లి, వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హయాంలో తాము కూడా నిరసనలు తెలిపి ఉద్యమాలు చేశామని...కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదన్నారు. 

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించాను... కానీ ఎప్పుడూ చెప్పులు, రాళ్లు విసిరలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపి ఉద్యమాలు నడిపామన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం, హోం మంత్రి, డీజీపీపై ఉందని సోమిరెడ్డి పేర్కొన్నారు. 


 

click me!