Dec 28, 2022, 3:58 PM IST
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ వేడుకలను దేశవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుంటున్నాయి. ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే జెండా ఆవిష్కరించగా తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్ లో రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ జెడా ఆవిష్కరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ లో జరిగిన ఈ ఆవిర్భావ వేడుకల్లో భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇటు రాష్ట్రంలో, అటు దేశంలోనూ విపత్కర పరిస్థితులు నెలకొని వున్నాయన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది... కుటుంబం పెరగడమే కాదు వారి ఆశలు, ఆకలి పెరిగాయి, అందుకే బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో దోచుకోవడానికి కేసీఆర్ సిద్ధమయ్యారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.