ఐటీ ఉద్యోగుల 'ఛలో రాజమండ్రి'... తెలంగాణ - ఏపీ బార్డర్ లో ఇదీ పరిస్థితి..

Sep 24, 2023, 1:17 PM IST

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇవాళ ఐటీ ఉద్యోగులు 'ఛలో రాజమండ్రి' చేపడుతున్నారు. హైదరాబాద్ నుండి రాజమండ్రికి తెల్లవారుజామున మూడు గంటల నుండే ఐటీ ఉద్యోగులు, టిడిపి మద్దతుదారులు కార్లలో ర్యాలీగా బయలుదేరారు. అయితే ఐటీ ఉద్యోగుల నిరసనపై ముందుగానే సమాచారం వుండటంతో ఆంధ్ర-తెలంగాణ బార్డర్ ముందుగానే భారీగా పోలీసులను మొహరించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఏపీ పోలీసులు పికెట్ ఏర్పాటుచేసారు. వందలాదిమంది పోలీసులు వాహనాల తనిఖీ చేపడుతూ ఐటీ ఉద్యోగుల వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మైలవరం ఏసిపి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి తెలంగాణ నుండి ఏపీకి వస్తున్నవారి ఐడీ కార్డులను పరశీలించాకే అనుమతిస్తున్నారు. 

హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఐటీ ఉద్యోగులు చేపట్టిన సంఘీభావ ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ డీసీపీ విశాల్ గున్ని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలకు అనుమతి లేదని డిసిపి తెలిపారు.