పాలేరు అసెంబ్లీ స్థానం నుండి నవంబర్ 4న వైఎస్ఆర్‌టీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
హైదరాబాద్: నవంబర్ 4న పాలేరు అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్‌టీపీ విలీనం నిలిచిపోయింది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 4వ తేదీన పాలేరు అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు చేయనున్నారు. నవంబర్ 1వ తేదీ నుండి నియోజకవర్గంలో వైఎస్ షర్మిల ప్రచారం నిర్వహించనున్నారు.
గతంలోనే పాలేరులోనే వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేయాలని షర్మిల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌లో విలీనం విజయవంతం కాకపోవడంతో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాలేరు అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. వైఎస్ కుటుంబంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో వైఎస్ షర్మిల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు వేర్వేరు పార్టీల అభ్యర్ధులుగా పాలేరు నుండి బరిలోకి దిగనున్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ కు లాభం జరగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ లో విలీనం చేయాలని తాను చేసిన ప్రయత్నాలు విజయవంతం కాలేదని ఇటీవల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వైఎస్ షర్మిల చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో సూచన మేరకు సోనియా , రాహుల్ గాంధీలతో కూడ పార్టీ విలీనంపై షర్మిల చర్చలు జరిపారు. వైఎస్ షర్మిల సేవలను తెలంగాణలో వినియోగించుకోవడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు కొందరు నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఈ విషయంలో ఇబ్బంది లేదన్నారు.
also read:119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ, నాలుగు నెలలుగా ఎదురుచూశా:కాంగ్రెస్‌లో విలీనంపై షర్మిల
షర్మిల సేవలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగించుకోవాలని తెలంగాణ నేతలు సూచించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నాయకత్వానికి వైఎస్ షర్మిల విధించిన డెడ్ లైన్ కూడ ముగిసింది. దీంతో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీన ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్నారు.