తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేతల మధ్య మాటల యుద్దం రోజురోజుకు పెరుగుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేతల మధ్య మాటల యుద్దం రోజురోజుకు పెరుగుతుంది. తాజగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఎప్పుడూ కలిసే ఉంటాయని విమర్శించారు. కరీంనగర్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్, ఎంఐఎంది రాజకీయ అక్రమ సంబంధం అని ఆయన ఆరోపించారు. అన్న తమ్ముడు పోయి, మళ్లీ మామ అలుళ్లు అయ్యారని విమర్శించారు. డబ్బు సంచులు అందగానే వావివరుసలు మారిపోయినయా అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్ బీసీలకు గుణం లేదని అన్నారని, అవమానించారని బండి సంజయ్ మండిపడ్డారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని అనడంతో గుణం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టికెట్లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ తక్షణమే బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒక్కటై బీజేపీ గ్రాఫ్ తగ్గించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అన్ని పార్టీల టార్గెట్ బీజేపీ కనుకే తమపై దాడి చేస్తున్నారని అన్నారు. బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తుందని చెప్పారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.