సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ తీరుపై సీపీఎం అసంతృప్తితో ఉంది. పొత్తు కుదరకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆ పార్టీ తేల్చి చెప్పింది.
హైదరాబాద్: సీట్ల సర్ధుబాటుపై ఎల్లుండిలోపుగా స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు. సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది.
ఆదివారంనాడు ఖమ్మంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడారు. సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ ఇంకా ఏ విషయాన్ని తేల్చలేదన్నారు. పాలేరు, వైరా,ఇబ్రహీంపట్టణం, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలు ఇవ్వాలని కోరినట్టుగా తమ్మినేని వీరభద్రం చెప్పారు. పాలేరు సీటు విషయమై తాము పట్టుబట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే పాలేరు సీటును ఇచ్చేందుకు కాంగ్రెస్ నిరాసక్తతను వ్యక్తం చేసిందన్నారు. అయితే వైరా సీటు ఇవ్వాలని కోరామన్నారు.
undefined
అయితే వైరా విషయంలో తమపై కొందరు నేతలు తప్పుడు ప్రచారం చేశారన్నారు. వైరా సీటును తీసుకొనేందుకు సీపీఎం సిద్దంగా లేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ సీట్లు ఇస్తే పొత్తుకు అంగీకరిస్తామని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం నుండి ఎల్లుండి లోపుగా స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. లేకపోతే తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని తమ్మినేని వీరభద్రం తేల్చి చెప్పారు.
నవంబర్ 1న రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి ఏ జిల్లాలో ఏ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దిగాలనే విషయమై చర్చించనున్నట్టుగా తమ్మినేని వీరభద్రం ప్రకటించారు.సమయం లేనందునే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉందన్నారు. ఈ సమావేశంలో సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ తేలుస్తుందో లేదో తేలుతుందన్నారు.
also read:కాంగ్రెస్ తీరుపై సీపీఎం అసంతృప్తి: 'తాము కోరిన సీట్లివ్వకపోతే ఒంటరిగానే బరిలోకి'
తమ పార్టీ ప్రాధాన్యత రీత్యా సీట్లను కోరుకున్నామని తమ్మినేని వీరభధ్రం చెప్పారు. పొత్తు విషయంలో కాంగ్రెస్ మాటలు గొప్పగా ఉన్నాయన్నారు. కానీ ఆచరణ మాత్రం అందుకు విరుద్దంగా ఉందని తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది.ఈ విషయమై లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ చర్చలు ప్రారంభించింది. అయితే సీట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ తీరుపై సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది.