అనువుగాని చోట అధికులమంటే... ఇలాగే బొక్కబోర్లా పడతావ్ కేసీఆర్..: షర్మిల ఎద్దేవా

Published : Apr 21, 2023, 04:31 PM IST
అనువుగాని చోట అధికులమంటే... ఇలాగే బొక్కబోర్లా పడతావ్ కేసీఆర్..: షర్మిల ఎద్దేవా

సారాంశం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సెటైర్లు విసిరాారు. 

హైదరాబాద్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటూ ఏపీ ప్రజలపై కపట ప్రేమ కురిపించి సీఎం కేసీఆర్ నవ్వులపాలయ్యాడని వైఎస్సార్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. స్టీల్ ప్లాంట్ ను చేజిక్కించుకునేందుకు బిడ్డింగ్ లో పాల్గొంటామంటూ బిల్డప్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడెందుకు వెనక్కి తగ్గారని నిలదీసారు. అనువుగాని చోట అధికులం అనరాదు అన్న సామెత గొప్పలు చెప్పుకునే కేసీఆర్ దొరకు సరిగ్గా సరిపోతుందంటూ షర్మిల ఎద్దేవా చేసారు. 

తినడానికి తిండి లేదు కానీ సోకులకు లోటా అన్నట్లుగా కేసీఆర్ తీరు వుందని షర్మిల అన్నారు. తెలంగాణలో మూతపడ్డ ప్రభుత్వ సంస్థలను తెరిచే దమ్ములేదు కానీ విశాఖ ఉక్కు కొంటానంటున్నాడు అంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొంటానని ఇన్నిరోజులు ప్రగల్బాలు పలికిన కేసీఆర్ వెనక్కితగ్గి పదిమందిలో తెలంగాణ పరువు తీశాడన్నారు. గొప్పలకు పోయి బొక్కబోర్లపడ్డాడని... బిల్డప్ ఎక్కువ పని తక్కువ అనిపించుకున్నాడని ఎద్దేవా చేసారు. 

ముందునుండీ అడ్డంపొడువు మాటలతో జనాలను ఫూల్స్ చేయడం దొరకు వెన్నతో పెట్టిన విద్య అని షర్మిల అన్నారు. తన మాటలతో నమ్మించి చివరకు నట్టేట ముంచడం ఆయనకు అలవాటేనని షర్మిల అన్నారు.

Read More  "సింగరేణి ప్రైవేటీకరణపై చర్చకు రావాలి" : సీఎం కేసీఆర్ కు ఈటల సవాల్

నిజంగానే కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలను తిరిగి తెరిపించాలని అన్నారు. దొరా... నువ్వు తెలంగాణ బిడ్డవే అయితే గతంలో హామీ ఇచ్చినట్లుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించి చూపించు అని షర్మిల సవాల్ విసిరారు. అలాగే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్స్ తెరిపిస్తా అంటివి కదా... ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అని షర్మిల సూచించారు.

గత ప్రభుత్వాల హయాంలో తెలంగాణ వ్యాప్తంగా మూతపడిన వందలాది ఫ్యాక్టరీలను తెరిపించాలని సీఎంను కోరారు షర్మిల. తద్వారా రోడ్డున పడ్డ లక్షలాది కార్మికులను ఆదుకోవాలని కోరారు. అంతేగానీ నీచ రాజకీయాల కోసం ప్రతీసారి రాష్ట్ర పరువును పణంగా పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని సీఎం కేసీఆర్ ను షర్మిల హెచ్చరించారు. 

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్