చంపే కుట్ర పన్నారా? : అర్ధరాత్రి ఆమరణ దీక్ష భగ్నంపై షర్మిల ఆందోళన

By Arun Kumar P  |  First Published Dec 11, 2022, 7:44 AM IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గత రాత్రి పోలీసులు భగ్నం చేసారు. 


హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గత అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసారు. గత రెండ్రోజులు దీక్షచేస్తున్న షర్మిల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో పోలీసులు ఆమెను బలవంతంగా దీక్షాస్థలి నుండి హాస్పిటల్ కు తరలించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యాలయం వద్దకు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చేరుకున్న పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు.  

అంతకుముందు ఆమరణ దీక్ష చేస్తున్న షర్మిలకు అపోలో డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. రెండ్రోజులు ఆహారం తీసుకోకపొవడంతో ఆమె ఆరోగ్యం మెల్లిగా దెబ్బతింటోందని... వెంటనే వైద్యం అందించాల్సి వుంటుందని డాక్టర్లు తేల్చారు. మంచి నీళ్ళు తీసుకోక పోవడంతో డీహైడ్రేషన్  అవుతోందని... దీనివల్ల కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదమని వైఎస్సార్ తెలంగాణ పార్టీ శ్రేణులకు డాక్టర్లు తెలిపారు.  

Latest Videos

అయితే షర్మిల మాత్రం తన మహాప్రస్థాన పాదయాత్రకు అనుమతులు వచ్చేవరకు దీక్ష విరమించబోనని తేల్చిచెప్పారు. పాదయాత్రకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చినా ప్రభుత్వం అడ్డుకుంటుందోదని ఆరోపించారు. అంతేకాదు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బయటకు రాకుండా చూస్తున్నారని మండిపడ్డారు. చివరకు ఆమరణ దీక్ష చేస్తున్న తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే పార్టీ శ్రేణులను కూడా మెడపట్టి ఈడ్చుకెళ్లి అరెస్టులు చేస్తున్నారని ... స్టేషన్ కు తీసుకెళ్లి దుర్భాషలాడుతూ కొడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. 

Read More అదే మాట నేనంటే తల ఎక్కడ పెట్టుకుంటావ్ : మంత్రి సత్యవతి రాథోడ్‌కు షర్మిల కౌంటర్

తెలంగాణ పోలీసులు సీఎం కేసీఆర్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని షర్మిల ఆరోపించారు. ఖాకీ చొక్కాలు వేసుకున్న పోలీసులు బిఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) కార్యకర్తలుగా మారారని... ఇండియన్ పీనల్ కోడ్ ను వాళ్లు పాటించడం లేదన్నారు. తెలంగాణ పోలీసులకు కల్వకుంట్ల కమీషన్ రావు రాసిన కొట్టిచంపే కోడ్ ఒక్కటే గుర్తున్నట్లుంది అని ఎద్దేవా చేసారు. 

ఓవైపు కేసీఆర్ ఆండ్ బ్యాచ్ బీఆర్ఎస్ ఆవిర్భావ సంబరాలు జరుపుకోవచ్చు కానీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు న్యాయమైన హక్కులకోసం నిరాహారదీక్ష చేస్తే నిర్భంధాలు, కర్ఫ్యూ, పోలీస్ ఆంక్షలా...! ప్రశ్నించే అధికారం, నిరసనలు తెలిపే హక్కు ఉందని తెలిసినా ఈ ఖాకీలకు పట్టడం లేదని మండిపడ్డారు. చివరకు తనను చూసేందుకు పార్టీ శ్రేణులనే కాదు కుటుంబసభ్యులను కూడా పోలీసులు రానివ్వడం లేదన్నారు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రమా? నియంత రాజ్యమా? ప్రశ్నించే గొంతుకను అష్టదిగ్బంధనం చేసి చంపే కుట్ర పన్నారా? అంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. 

నర్సంపేట నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్రను పోలీసులు అడ్డుకోగా హైకోర్టు అనుమతితో ఆయన పున:ప్రారంభించాలని చూసారు. ఈ నెల 4వ తేదీ నుండి  నర్సంపేట నియోజకవర్గంలోని లింగగిరి నుండి పాదయాత్రను కొనసాగించడానికి షర్మిల సిద్దమయ్యారు. అయితే  పాదయాత్రకు సంబంధించి వరంగల్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు.  గతంలో  పాదయాత్రకు అనుమతిని ఇస్తే జిల్లాలో ఉద్రిక్తతలకు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. మరోసారి  పాదయాత్రకు అనుమతిస్తే శాంతిభద్రతల సమస్యల తలెత్తే అవకాశం ఉందని  పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.  


 

 

 

click me!