వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయ పార్టీ: వెనక ప్రశాంత్ కిశోర్?

By telugu teamFirst Published Feb 9, 2021, 12:36 PM IST
Highlights

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టడం వెనక ప్రశాంత్ కిశోర్ ఉన్నారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి అటువంటిదేమీ లేదని ప్రశాంత్ కిశోర్ సన్నిహితులు అంటున్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల రాజకీయ పార్టీని పెట్టాలనే నిర్ణయం వెనక పెద్ద ప్రణాళికనే ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో చేతులెత్తేసిన స్థితిలో వైఎస్ షర్మిల ముందుకు వస్తున్నట్లు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

వైఎస్ షర్మిల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ కోసం పనిచేసిన ఆయన తెలంగాణలో వైఎస్ షర్మిలతో పార్టీ పెట్టించి ముందుకు నడిపించే వ్యూహరచన చేసినట్లు భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ తో పనిచేయడానికి ప్రశాంత్ కిశోర్ సిద్ధంగా లేరని సమాచారం. 

Also Read: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా: షర్మిల

టీఆర్ఎస్ ప్రశాంత్ కిశోర్ ను వాడుకోవడానికి సిద్ధంగా లేరా, ప్రశాంత్ కిశోర్ టీఆర్ఎస్ కు పనిచేయడానికి సుముఖంగా లేరా అనే విషయాలను పక్కన పెడితే షర్మిలను తెలంగాణలో నిలబెట్టాలనే పట్టుదలతో ఆయన ముందుకు వస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, షర్మిలతో ప్రశాంత్ కిశోర్ ఒప్పందం చేసుకున్నారా, లేదా అనేది నిర్ధారణ కావడం లేదు. ప్రస్తుతానికి ఇది ఊహాగానాల స్థాయిలోనే ఉంది. 

Also Read: లోటస్‌పాండ్‌లో షర్మిల: వైఎస్ఆర్ అభిమానులకు అభివాదం

వైఎస్ జగన్ తో విభేదించి షర్మిల రాజకీయ పార్టీ పెట్టాలని అనుకుంటున్నారనే ప్రచారం కూడా వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె కాలు పెట్టే అవకాశాలు లేవని అంటున్నారు. తెలంగాణలో బిజెపి టీఆర్ఎస్ కు సవాల్ విసురుతూ దూసుకొస్తున్న స్థితిలో షర్మిల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ మీద ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో బిజెపి ప్రయోజనం పొందే స్థితికి చేరుకుంది. అయితే, అది బిజెపి వైపు మళ్లకుండా తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ఉద్దేశంతో షర్మిల పార్టీ ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న ఆదరణ తమకు ఉపయోగపడుతుందని షర్మిల సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. వైఎస్ మీద ప్రజల్లోనే కాకుండా నాయకుల్లో కూడా ఆదరణ ఉంది. కాంగ్రెసు పార్టీ తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. కాంగ్రెసు కోల్పోతున్న బలం తమకు కలిసి వస్తుందని వారు భావిస్తున్నారు. ఏమైనా, తెలంగాణలో వైఎస్ షర్మిల తన సత్తా చాటేందుకు ముందుకు వస్తున్నట్లు కనిపిస్తున్నారు. 

ప్రస్తుతానికి ప్రశాంత్ కిశోర్ వైఎస్ షర్మిలతో కలిసి పనిచేయడం లేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసుకు పనిచేస్తున్న విషయం తెలిసిందే.

click me!