గుండెపోటు భయంతో ఉరేసుకుని... హైదారాబాద్ శివారులో యువకుడి సూసైడ్

By Arun Kumar P  |  First Published Jun 20, 2023, 1:06 PM IST

చిన్నవయసులోనే గుండెనొప్పితో బాధపడుతూ అది భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 


హైదరాబాద్ : వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోయింది. మారిన జీవనశైలి, అహారపు అలవాట్లు.... ఇలా కారాణమేదో తెలీదుగానీ చిన్న వయసులో గుండెపోటుకు గురయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ గుండెపోటు మరణాలు చూసి కంగారుపడిపోయిన యువకుడు తీవ్ర ఆందోళనకు గురయినట్లున్నాడు. తనను కూడా తరచూ ఛాతిలో నొప్పి వస్తుండటంతో భయపడిపోయిన అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం చెందిప్ప గ్రామానికి చెందిన విద్యాసాగర్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు సంతానం. వీరి చిన్న కొడుకు హరికృష్ణ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇతడు గత మూడేళ్లుగా గుండెనొప్పితో బాధపడుతుండగా ఇటీవల అది మరీ ఎక్కువయ్యింది. హాస్పటల్స్ చుట్టూ తిరిగినా అతడి గుండెనొప్పి మాత్రం తగ్గలేదు. ఇలా తరచూ అతడి గుండెనొప్పి వేధించేది. 

Latest Videos

గత ఆదివారం కూడా హరికృష్ణ గుండెలో నొప్పిగా వుండటంతో మందులు తెచ్చుకుని వేసుకున్నాడు. అయినప్పటికి నొప్పి తగ్గలేదు. తల్లిదండ్రులకు ఈ గుండెనొప్పి గురించి తెలిస్తే కంగారుపడతారని చెప్పకుండా లోలోపలే బాధను భరించాడు. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసిన హరికృష్ణ తన గదిలోకి వెళ్లి సూసైడ్ లెటర్ రాసిపెట్టాడు. తెల్లవారుజామునే పొలంవద్దకు వెళ్లి ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

Read More  హన్మకొండ జిల్లాలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం.. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి..

హరికృష్ణ మృతదేహాన్ని గమనించిన గ్రామస్తులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లిచూసేసరికే అతడు ప్రాణాలు కోల్పోయి వున్నాడు. దీంతో కొడుకు మృతదేహం వద్దే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతడి గదిలో లభించిన సూసైడ్ లెటర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కొడుకు సూసైడ్ పై విద్యాసాగర్ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

''అమ్మానాన్న... ఈ గుండెనొప్పిని నేను భరించలేకపోతున్నా. చిన్నవయసులోనే మిమ్మల్ని విడిచి వెళుతున్నందుకు సారీ. మిస్ యు అమ్మానాన్న. మిస్ యూ అన్నయ్య' అంటూ సూసైడ్ లెటర్ రాసిపెట్టాడు హరికృష్ణ. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. 
 

click me!